ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయి.. ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఆప్ నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరసనలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు తమ నేతను అక్రమ కేసులో ఇరికించి అరెస్ట్ చేసి.. ఆప్ పార్టీని లేకుండా చేయడమే బీజేపీ లక్ష్యమని తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ రంగంలోకి దిగారు. ఇప్పటికే కేజ్రీవాల్ అరెస్ట్‌పై.. బీజేపీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించిన సునీత కేజ్రీవాల్.. కస్టడీ నుంచి కేజ్రీవాల్ పంపించిన సందేశాన్ని వీడియో ద్వారా వినిపించారు. ఈ క్రమంలోనే తాజాగా కేజ్రీవాల్ కోసం మెసేజ్‌లు చేయండి అంటూ వినూత్న ప్రచారానికి దిగారు. ఇందుకు సంబంధించి ఒక వాట్సాప్ నెంబర్‌ను కూడా సునీత కేజ్రీవాల్ షేర్ చేశారు.
ఈడీ కస్టడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో అందరం ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌కు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. అందు కోసం సోషల్ మీడియా వేదికగా స్పెషల్ సోషల్ మీడియా డ్రైవ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కేజ్రీవాల్ కోసం 8297324624 వాట్సాప్ నంబరుకు మెసేజ్‌లు చేయండి అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. వాటిని తాను కేజ్రీవాల్‌కు చేరవేస్తానని చెప్పారు. ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలతో కేజ్రీవాల్ ధైర్యంగా ఉంటారని సునీత తాజాగా మరో వీడియోను విడుదల చేశారు.
ఇక దేశంలో అవినీతి, నియంతలకు వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్ పోరాడుతున్నారని సునీత పేర్కొన్నారు. ఈ సమయంలో ఆయనకు అండగా ఉండేందుకు ప్రజలందరి ఆశీర్వాదం కావాలని ఆమె తెలిపారు. తన భర్త నిజమైన దేశభక్తుడని.. కోర్టులో నిలబడి నిజానిజాలన్నీ బయటపెట్టాలంటే చాలా ధైర్యం కావాలని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఉన్న నియంత శక్తులను కేజ్రీవాల్ సవాల్ చేస్తున్నారని.. అందుకు ఆయనకు మనం అంతా మద్దతు ప్రకటించాలని కోరారు.
మరోవైపు.. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఆప్ నేతలు పేర్కొన్నారు. ఆయన షుగర్ లెవల్స్ దారుణంగా పడిపోయాయని తెలిపారు. వెంటనే ఆయనకు చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. ఇక ఈడీ కస్టడీలో ఉన్ కేజ్రీవాల్‌ను అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని సునీత కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో కేజ్రీవాల్‌కు విధించిన ఈడీ కస్టడీని గురువారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరో నాలుగు రోజులు పొడగించింది.