ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైలు.. వీడియో విడుదల

national |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 10:40 PM

దశాబ్దాల చరిత్ర కలిగిన భారత రైల్వేల్లో ఎన్నో అత్యాధునిక, వేగవంతమైన, సౌకర్యవంతమైన రైళ్లు వచ్చి చేరుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో పట్టాలెక్కిన వందే భారత్ రైళ్లు వేగంతోపాటు సౌకర్యవంతంగా టెక్నాలజీతో కూడుకున్నవి పరిగెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే త్వరలోనే మన దేశంలో బుల్లెట్ రైలు పరుగులు పెట్టేందుకు సిద్ధం అవుతోంది. ఈ బుల్లెట్ రైలు ప్రయాణించేందుకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముంబై నుంచి అహ్మదాబాద్ మార్గంలో 508 కిలోమీటర్ల ట్రాక్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ మార్గంలో నిర్మిస్తున్న బుల్లెట్ రైలు పట్టాలకు సంబంధించిన వీడియోను తాజాగా కేంద్ర రైల్వే్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్విటర్‌లో పంచుకున్నారు.


ముంబై-అహ్మదాబాద్‌ మార్గంలో 508 కిలోమీటర్ల మేర ట్రాక్‌ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సాధారణ రైళ్లు ప్రయాణించే పట్టాలపై గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైలు పరిగెత్తలేదు కాబట్టి.. బుల్లెట్ రైళ్ల కోసం స్పెషల్ ట్రాక్‌ను రైల్వేశాఖ నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ బుల్లెట్ రైలు ట్రాక్‌కు సంబంధించిన వీడియోను తాజాగా అశ్వినీ వైష్ణవ్‌ విడుదల చేశారు. ఈ ట్రాక్‌పై బుల్లెట్ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుందని వివరించారు. అంతేకాకుండా ఆ పట్టాలపై బుల్లెట్ రైలు పరిగెత్తే దృశ్యాలను యానిమేషన్ రూపంలో పొందుపరిచారు.


మేక్ ఇన్ ఇండియా కింద నిర్మిస్తున్న ఈ ట్రాక్‌లు బ్యాలస్ట్‌లెస్‌గా ఉన్నాయని.. కంకర, కాంక్రీట్ కోణాలు అవసరం లేని ట్రాక్‌లు అని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. హై-స్పీడ్ రైళ్ల బరువును భరించేందుకు ప్రత్యేకంగా ట్రాక్‌ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ మార్గంలో 153 కిలోమీటర్ల మేర వయాడక్ట్ పనులు పూర్తైనట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. దీంతోపాటు 295.5 కిలోమీటర్ల పీర్ వర్క్ కూడా పూర్తయినట్లు చెప్పారు. దీనికోసం స్పెషల్‌ జేస్లాబ్‌ బాలస్ట్‌లెస్‌ ట్రాక్‌ సిస్టమ్‌ ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ట్రాక్ సిస్టమ్‌లో ప్రధానంగా 4 భాగాలు ఉంటాయని.. ఆర్‌సీ ట్రాక్‌ బెడ్‌, కాంక్రీట్‌ ఆస్ఫహాల్ట్ మోర్టార్‌ లేయర్‌, ఫాస్టెనర్‌లతో ప్రీ-కాస్ట్ స్లాబ్‌, పట్టాలతో కలిసి ట్రాక్‌ నిర్మిస్తున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు.


దేశంలోని రెండు చోట్ల ప్రీ-కాస్ట్ ఆర్‌సీ ట్రాక్ స్లాబ్‌లను తయారు చేస్తున్నట్లు ఆ వీడియోలో వెల్లడించారు. గుజరాత్‌లోని ఆనంద్, కిమ్‌లో ఇవి తయారవుతున్నాయని.. సుమారు 35 వేల మెట్రిక్ టన్నుల పట్టాలు అందుబాటులోకి వచ్చాయని రైల్వేశాఖ వివరించింది. 2026 నాటికి దేశంలో తొలి బుల్లెట్ రైలు పట్టాలపై పరుగులు తీయనున్నట్లు అశ్వినీ వైష్ణవ్ ఇప్పటికే వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన రైజింగ్‌ భారత్‌ సమ్మిట్‌లో పాల్గొన్న అశ్వినీ వైష్ణవ్.. బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి మహారాష్ట్రలోని ముంబై మధ్య మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రయాణించనున్నట్లు వివరించారు. ఇప్పటికే అహ్మదాబాద్ - ముంబై హై స్పీడ్ రైలు కారిడార్ నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com