ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. వేడి సెగ కూడా పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2.6 నుంచి 2.9 డిగ్రీల వరకు పెరిగాయి. ముఖ్యంగా రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లోనూ వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. రాయలసీమ జిల్లాల్లో వేడి, తేమ, అసౌకర్య వాతావరణం ఏర్పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇవాళ 42 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 44 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. కడప 18, నంద్యాల 8, పార్వతీపురంమన్యం 8, ఎన్టీఆర్ 6, గుంటూరు 1, పల్నాడు ఒక్క మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాలలో 42.0, కర్నూలు 41.9, కడప 41.2, అనంతపురం 40.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప జిల్లాలో 13, నంద్యాల జిల్లాలో 9, కర్నూలు 2, పార్వతీపురం మన్యం 2, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అనంతపురం జిల్లాల్లోని ఒక్కో మండలంలో వడగాలులు వీచాయి. శుక్రవారం కడప,నంద్యాల, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని.. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వీలైనంత వరకు బయటకు రాకపోవడం మంచిది అంటున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, ముసలివాళ్లు బయటకు రావొద్దని సూచిస్తున్నారు.