సినీ హీరో నిఖిల్ టీడీపీలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో నిఖిల్ సిద్ధార్థ్ సైకిల్ కండువా కప్పుకున్నారు. నిఖిల్ మామ మద్దులూరి మాలకొండయ్య యాదవ్ బాపట్ల జిల్లా చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుఫున పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిఖిల్ సైతం టీడీపీకి తన మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో నిఖిల్ టీడీపీ తరుఫున ప్రచారం చేసే అవకాశం ఉంది.
నిఖిల్ సోదరిని మాలకొండయ్య యాదవ్ పెద్ద కుమారుడుఅమర్‌నాథ్‌కు ఇచ్చి వివాహం చేశారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య బంధుత్వం ఉంది. మరోవైపు మద్దులూరి మాలకొండయ్య యాదవ్ అలియాస్ ఎంఎం కొండయ్యకు 15 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉంది. అంతేకాదు విద్యాసంస్థలు, రియల్ ఎస్టేట్ రంగంలోనూ మాలకొండయ్య యాదవ్ పేరు సంపాదించుకున్నారు. ఇక 2009 ఎన్నికల్లో టీడీపీ తరుఫున ఒంగోలు ఎంపీ సీటుకు పోటీ చేసి మాలకొండయ్య ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. అయితే 2019 ఎన్నికలకు ముందు మళ్లీ టీడీపీలో చేరారు.
ఇక 2019 ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ తరుఫున గెలుపొందిన కరణం బలరాం ఆ తర్వాత వైసీపీలో చేరారు. దీంతో చీరాల ఇంఛార్జిగా మాలకొండయ్యకు టీడీపీ అధిష్టానం ఛాన్స్ ఇచ్చింది. చీరాల అసెంబ్లీ సెగ్మెంట్లో యాదవ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా మాలకొండయ్యకు చంద్రబాబు అవకాశం కల్పించారు. అటు వైసీపీ కరణం బలరాంకు బదులుగా ఆయన తనయుడు కరణం వెంకటేశ్‌కు వైసీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. మామ తరుఫున నిఖిల్ ప్రచారం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే నిఖిల్ టీడీపీలో చేరలేదని, తన మామకు టికెట్ కేటాయించినందుకు నారా లోకేష్‌కు ధన్యవాదాలు తెలియజేసినట్లు నిఖిల్ సన్నిహితులు చెప్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన మామ మద్దులూరి మాలకొండయ్యకు అవకాశం ఇచ్చినందుకు లోకేష్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.