ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మరో మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీని వీడారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాషా సైకిల్ పార్టీకి గుడ్ బై చెప్పారు. సోమవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన చాంద్ భాషా తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపారు. మరోవైపు కదిరి మాజీ ఎమ్మెల్యే అయిన అత్తార్ చాంద్ భాషా మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు. టీడీపీ నుంచి టికెట్ ఆశించారు. అయితే అధిష్టానం మాత్రం కందికుంట వెంకటప్రసాద్ వైపే మొగ్గు చూపటంతో చాంద్ బాషా అసంతృప్తి చెందారు. ఈ క్రమంలోనే సైకిల్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి కదిరి ఎమ్మెల్యేగా చాంద్ భాషా గెలుపొందారు. అయితే ఆ తర్వాత పార్టీ మారిన చాంద్ భాషా.. అప్పట్లో అధికారపార్టీ అయిన టీడీపీలో చేరారు. ఇక 2019 ఎన్నికల్లోనూ చాంద్ బాషా టీడీపీ టికెట్ ఆశించగా.. చంద్రబాబు మాత్రం కందికుంటకు కేటాయించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ తరుఫున సిద్ధారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో అయినా ఛాన్స్ వస్తుందని అనుకుంటే ఆధినేత మరోసారి కందికుంట వైపే మొగ్గుచూపటంతో చాంద్ భాషా టీడీపీకి రాజీనామా చేశారు. కదిరి నియోజకవర్గంలో మైనారిటీ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. ఈ క్రమంలో వైసీపీ మైనారిటీ అభ్యర్థిని బరిలో నిలుపుతోంది. ఈ నేపథ్యంలో మైనారిటీ అయిన తనకు టీడీపీ టికెట్ వస్తుందని చాంద్ భాషా భావించారు.
అయితే పార్టీ మారిన సమయంలో మంత్రి పదవితో పాటుగా తగిన గుర్తింపు ఇస్తామని చంద్రబాబు మాట ఇచ్చినట్లు చాంద్ భాషా చెప్తున్నారు. ఆ తర్వాత చంద్రబాబు మాట తప్పారన్న చాంద్ భాషా.. కదిరిలో ఇటీవల ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు, బహిరంగ సభకు సైతం సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యేగా తొలిసారిగా అవకాశం ఇచ్చిన వైసీపీ అధినేత జగన్‌కు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానన్న ఆయన.. కదిరిలో సోమవారం జగన్ సమక్షంలో తిరిగి సొంతగూటికి చేరనున్నారు.