మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని మరోసారి కోర్టు పొడిగించింది. ఈ కేసులో ఆయన 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. దీంతో ఆయనను తిహార్ సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. సోమవారం ఆయన కస్టడీ గడువు ముగియడంతో కేజ్రీవాల్‌ను కోర్టు ముందు హాజరుపరిచారు.
ఈ కేసులో 9 సార్లు ఈడీ సమన్లను జారీచేసినా కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ (ED) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన కోర్టులో హాజరుపర్చగా.. ఏడు రోజులు, ఆ తర్వాత నాలుగు రోజుల కస్టడీకి అప్పగించింది. సోమవారంతో ఆయన కస్టడీ ముగియడంతో కోర్టులో ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా ఈడీ తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు.. అరవింద్ కేజ్రీవాల్ విచారణకు సహకరించలేదని, దర్యాప్తును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన డిజిటల్ పరికరాల పాస్‌వర్డ్‌లను చెప్పడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం ఈడీ కస్టడీ పొడిగింపు కోరడం లేదన్నారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ కస్టడీలోకి తీసుకుంటామని, అప్పటి వరకూ జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని కోరారు.
న్యాయస్థానంలోకి వెళ్లే ముందు కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ చేస్తున్న చర్యలు దేశానికి మంచిది కాదు’ అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఇప్పటికే ఆప్ నేతలు మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలు అరెస్ట్ కాగా.. వారంతా తిహార్ జైల్లో ఉన్నారు. ఇక, గతవారం కోర్టులో తన కేసును తానే వాదించుకున్న కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ పార్టీని అణిచివేసేందుకు ఈడీ ప్రయత్నిసోందని సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో రూ.100 కోట్ల అవినీతి జరిగిందని ఈడీ చెబుతోందని.. మరి ఆ సొమ్మంతా ఎక్కడికి పోయిందని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేసేందుకు తగిన ఆధారాలు ఈడీ వద్ద లేవని పేర్కొన్నారు. ఏ కోర్టు కూడా తనను దోషిగా పరిగణించలేదని న్యాయమూర్తి ముందు వాదనలు వినిపించారు. ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ దాఖలు చేసిన 31 వేల పేజీల ఛార్జిషీట్, ఈడీ దాఖలు చేసిన 25వేల పేజీల ఛార్జిషీట్‌లో ఎక్కడా తన పేరు లేదన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. అయినా తనను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు.