టీడీపీ అధినేత చంద్రబాబుతో రాష్ట్రంలో రామ రాజ్యం వస్తుందని.. జగన్ పాలన రావణ రాజ్యానికి ప్రతీక అని వర్ల రామయ్య ఆక్షేపించారు. సీఎం జగన్ పాలన అప్రజాస్వామికం అని.. రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. "చంద్రబాబు నాయుడితోనే రామరాజ్యం సాధ్యమని ప్రజలు నమ్మి గెలిపించాలనుకుంటున్నారు. అందుకే జగన్ రెడ్డి అడ్డదారులు తొక్కైనా అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తున్నాడు. వైసీపీ నేతలు ఓటర్లకు పంచే గిఫ్టులను ప్రలోభ పెట్టేందుకు శ్రీకాళహస్తి, రేణిగుంట విమానాశ్రయానికి దగ్గరలోని రెండు గోడౌన్‌లలో పెద్దఎత్తున నిల్వ చేశారు. అందులో రిస్ట్ వాచ్‌లు, కుక్కర్లు, గొడుగులు, చీరలు, హ్యాండ్ ఫ్యాన్లు లాంటి కోట్ల రూపాయల విలువైన బహుమతులు ఉన్నాయి. గోదాంలలో పెద్ద మొత్తంలో డబ్బులు దాచిపెట్టారు. ఈ వ్యవహారంపై టీడీపీ నాయకులు సీఈసీకి, ఎస్ఈసీకి, ఆర్ఓకు, సీవిజిల్‌లో సైతం పిర్యాదు చేశారు. అయినా సీవిజిల్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈసీ ఆశించిన స్థాయిలో పని చేయట్లేదు. ఎన్నికల అధికారులు ఆ గోడౌన్‌లను ఎందుకు సీజ్ చేయలేదు? జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఏం చేస్తున్నారు? కొంతకాలంగా వందలాది మంది టీడీపీ కార్యకర్తలు ఆ గోడౌన్‌లను కాపాలా కాస్తున్నారు. పోలీసులు చేయాల్సిన పనిని మా కార్యకర్తలు చేస్తుంటే తిరిగి మమ్మల్నే బెదిరిస్తున్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మా నేతలకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఎన్నికల అధికారులు ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్న వైసీపీ నేతలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇన్ని ఫిర్యాదులు చేసినా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్పందించకపోవడం బాధాకరం" అని వర్ల రామయ్య అన్నారు.