టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై బీజీపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి సంచనల ఆరోపణలు చేశారు. ఈవోపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తిరుమలలో ఉండి స్వామి వారికి సేవలు చేయాల్సిన టీటీడీ ఈవో అధికార పార్టీ సేవలో తరిస్తున్నారని మండిపడ్డారు. ఆయనపైన పూర్తి సాక్ష్యాధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఐఏఎస్ స్థాయి అధికారి టీటీడీ ఈవోగా ఉండాలన్నారు. నియమ నిబంధనలు సడలించి తిరుమలలో జేఈవోను నియమించకుండా, అధికారాలన్నీ ఒకే వ్యక్తి చేతిలో పెట్టి తిరుమల దర్శనాల ద్వారా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అనేక నియోజకవర్గాల ఇన్‌చార్జీలకు సుపథం, బ్రేక్ దర్శనాలు కేటాయించి దర్శనాలతో ఓట్లు లబ్దిగా పొందుతున్నారని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో అంగబలం, అర్థబలం సమకూర్చడానికే ఈ అధికారిని కొనసాగిస్తున్నారని అన్నారు. అందుకే మార్చి 12న తిరుమలలో పని చేసే ఈవో సేవలు ఇంకా అవసరమని కేంద్రానికి సీఎం లేఖ రాశారన్నారు. రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లను కాదని, ధర్మారెడ్డినే కొనసాగించాలా? మిగతా అధికారులపైన ముఖ్యమంత్రికి నమ్మకం లేదా? అని ప్రశ్నించారు. డిప్యూటీ ఈవో స్థాయి అధికారి తిరుమలలో రద్దీని సమర్థవంతంగా నిర్వహించగలరని, రద్దీని నియంత్రించటానికి ఈయన అవసరం లేదన్నారు. అధికార దుర్వినియోగం చేసి, అనధికారికంగా ఓ పీఏను పెట్టుకుని దర్శనాలు చేయించి బెంగళూరు వాళ్లు, ముంబాయి వంటి నగరాలకు చెందిన వారి నుంచి ఎక్కడికక్కడ ఎంత డబ్బులు తీసుకున్నారో వివరాలు తన వద్ద ఉందని... తొందర్లో బయటపెడతానని తెలిపారు.