ఏపీలో పింఛన్ల కోసం వెళ్లి ఇద్దరు వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభం కాగా.. ఉదయం నుంచి లబ్ధిదారులు సచివాలయాల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు. పింఛన్ల కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలోనే ఎండ వేడిమికి తాళలేక తిరుపతి, కృష్ణాజిల్లాలో ఇద్దరు వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు.కృష్ణా జిల్లా గంగూరులో 80 ఏళ్ల వజ్రమ్మ అనే వృద్ధురాలు వడదెబ్బ తగిలి చనిపోయింది. పింఛన్ కోసం ఉదయం నుంచి ఎదురుచూసిన వజ్రమ్మ.. ఎండదెబ్బకు తాళలేక అస్వస్థతకు గురైనట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే వడదెబ్బ తగిలి చనిపోయిందని తెలిపారు.
అలాగే తిరుపతి జిల్లా నెరబైలులోనూ ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం నుంచి సచివాలయం వద్ద పింఛన్ కోసం ఎదురు చూసిన షేక్ అసం సాహెబ్ అనే వృద్ధుడు.. కళ్లు తిరిగి పడిపోయాడు. గమనించిన స్థానికులు, కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయాడు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు పింఛన్ కోసం ఉదయమే సచివాలయాల వద్దకు చేరుకున్నారు. సచివాలయాల వద్ద బుధవారం నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. బుధవారం నుంచిన నాలుగు రోజుల పాటు అంటే ఏప్రిల్ 6 వరకూ పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. అనారోగ్యంతో ఉన్నవారు, దివ్యాంగులు, వితంతువులకు ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ చేస్తారని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. సచివాలయాల్లో సిబ్బంది సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో మిగతా లబ్ధిదారులు సచివాలయాల వద్ద తీసుకోవాలని సూచించింది.
అయితే బుధవారం నుంచి పింఛన్లు పంపిణీ చేస్తారని తెలియటంతో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల వద్దకు పింఛన్ దారులు క్యూ కట్టారు. ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే సచివాలయ సిబ్బంది బ్యాంకులకు వెళ్లి డబ్బులు తీసుకుని రావాల్సిన నేపథ్యంలో.. పలుచోట్ల పింఛన్ల పంపిణీ మధ్యాహ్నం నుంచి ప్రారంభమైంది. దీంతో పింఛన్ కోసం వచ్చిన వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే కృష్ణాజిల్లాలో వజ్రమ్మ అనే వృద్ధురాలు వడదెబ్బ కారణంగా చనిపోయినట్లు తెలిసింది.
అయితే నాలుగు రోజుల పాటు పింఛన్ల పంపిణీ జరుగుతుందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారు. అనారోగ్యంతో ఉన్నవారికి, దివ్యాంగులకు, వితంతువులకు ఇంటి వద్దే పింఛన్ పంపిణీ చేస్తారని.. సచివాలయాల వద్దకు వచ్చి ఎదురుచూడాల్సిన అవసరం లేదంటున్నారు. మరో మూడు రోజులపాటు పింఛన్ పంపిణీ జరగనున్న నేపథ్యంలో.. అందరికీ పింఛన్లు అందుతాయని.. ఆందోళన అవసరం లేదని చెప్తున్నారు.