ఏపీ రాజకీయాలపై సినీనటి, మాజీ ఎంపీ జయప్రద కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అవకాశం ఇస్తే పోటీచేస్తానంటూ తన మనసులోని మాటను బయటపెట్టుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని జయప్రద దర్శించుకున్నారు. జయప్రద ఏటా తన పుట్టినరోజు నాడు శ్రీవారిని దర్శించుకోవటం ఆనవాయితీ. ఈ క్రమంలోనే బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు జయప్రదం. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. తన మనసులోని మాటను బయటపెట్టారు. ప్రస్తుతం తాను బీజేపీలో ఉన్నానన్న జయప్రద.. ఏపీలో అవకాశం ఇస్తే పోటీచేస్తానన్నారు. ఎక్కడున్నా కూడా తాను మాత్రం ఆంధ్రాబిడ్డనేనని చెప్పుకొచ్చారు,
" ప్రస్తుతం నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ బిడ్డగా ఇక్కడ అవకాశం వస్తే కచ్చితంగా పోటీచేస్తా. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం మేరకు నడుచుకుంటా . ఏపీలో ఎవరైతే రాజధాని తీసుకు రాగలరో, ఎవరైతే యువకులకు ఉద్యోగం., మహిళలకు రక్షణ కల్పించగలరో వారే అధికారంలోకి రావాలనేది నా కోరిక. కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా" అని జయప్రద చెప్పుకొచ్చారు.
మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నా, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య అన్నా తనకు చాలా ఇష్టమని జయప్రద చెప్పారు. ఎన్డీఏ అధిష్టానం చెప్తే కచ్చితంగా ఏపీలో ప్రచారం చేస్తానని తెలిపారు.అలాగని పిలవని పేరంటానికి వెళ్లనని చెప్పారు.
"నాకు పవన్ కళ్యాణ్,బాలకృష్ణ అంటే చాలా ఇష్టం. మోదీ, చంద్రబాబు అంటే చాలా గౌరవం. వాళ్లు పిలిస్తే స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేస్తా. అయితే పిలవని పేరంటానికి వెళ్లను. ఏపీకి రాజధాని, స్పెషల్ స్టేటస్ లేవు. ఇక్కడి సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలను కోరుతున్నా" అని జయప్రద అన్నారు.
మరోవైపు టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత నేత ఎన్టీఆర్ హయాంలో టీడీపీలో చేరారు జయప్రద. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజ్యసభ ఎంపీగా, తెలుగు మహిళ అధ్యక్షురాలిగానూ పనిచేశారు. ఆ తర్వాత యూపీ వెళ్లారు జయప్రద. అక్కడ సమాజ్‌వాదీ పార్టీలో చేరి ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాతి పరిణామాల్లో బీజేపీలో చేరిన జయప్రద.. ప్రస్తుతం యూపీలో బీజేపీ విజయం కోసం పనిచేస్తున్నారు.