వేసవి సెలవుల నేపథ్యంలో రైళ్లల్లో ప్రయాణికుల రద్దీ పెరగనుంది. సెలవుల నేపథ్యంలో విహారయాత్రలకు వెళ్లేవారితో పాటు.. సొంతూళ్లకు ప్రయాణం కట్టే ప్యాసింజర్లతో రైలు బోగీలు కిటికిటలాడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగించిన దక్షిణమధ్య రైల్వే.. తాజాగా మరికొన్ని ప్రత్యేక రైలు సర్వీసులను కూడా పొడిగించింది. ముఖ్యంగా కృష్ణా జిల్లా నుంచి తిరుపతికి వెళ్లాలనుకునే వారికి శుభవార్త చెప్పింది.
వేసవి రద్దీ కారణంగా ప్రయాణికుల సౌలభ్యం కోసం విజయవాడ మీదుగా నడిచే హిసార్ , తిరుపతి స్పెషల్ రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.09715 తో హిసార్, తిరుపతి మధ్య సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైలును నడుపుతోంది. ఈ స్పెషల్ ట్రైన్ సర్వీస్ ఏప్రిల్ 6 నుంచి మే 25 వరకు ప్రతి శనివారం నడవనుంది. అలాగే 09716తో తిరుపతి, హిసార్ మధ్య మరో స్పెషల్ ట్రైన్ నడుస్తోంది. ఈ రైలును ఈ నెల 9 నుంచి మే 28 వరకు ప్రతి మంగళవారం నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే్ తెలిపింది. ఈ స్పెషల్ ట్రైన్ విజయవాడ, ఉజ్జయినితో పాటు ప్రధాన స్టేషన్లలో ఆగనుంది.
మరోవైపు హౌరా – యశ్వంత్ పూర్ మధ్య వారంలో ఒకరోజు ఏసీ స్పెషల్ ట్రైన్ నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారి ఏకే త్రిపాఠి తెలిపారు. 02863 నంబరుతో హౌరా – యశ్వంత్ పూర్ మధ్య వీక్లీ ఏసీ స్పెషల్ ట్రైన్ నడుపుతున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైలు ఈ ఏప్రిల్4,11 తేదీల్లో హౌరాలో మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రారంభమై.. మరుసటి రోజు రాత్రికి 12.15 గంటలకు యశ్వంత్ పూర్ చేరుకుంటుంది. మధ్యలో విజయనగరం, విజయవాడ, రేణిగుంట స్టేషన్లలో ఆగనుంది. యశ్వంత్‌పూర్ నుంచి తిరిగి హౌరాకు 6,13 తేదీల్లో అందుబాటులో ఉండనుంది.