పుంగనూరులోని సుగుటూరు గంగమ్మ జాతర బుధవారం ఘనంగా జరిగింది. పట్టణం జనసంద్రంగా మారింది. వేలాదిమంది భక్తులు గెరిగెలు మోసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం రాత్రి పురవీధుల్లో ఘనంగా ఊరేగింపు పూర్తి చేసుకున్న అమ్మవారిని నిర్వాహకులు బుధవారం వేకువజామున జమిందారీ ప్యాలె్‌సలోని సుగుటూరు గంగమ్మ ఆలయంలో భక్తుల దర్శనం కోసం కొలువుదీర్చారు. తోటి కులస్తులు గంగమ్మకు జంతుబలులు సమర్పించిన అనంతరం ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు కిక్కిరిశాయి. పట్టణంలో ఎటు చూసినా భక్తజనమే. గంగమ్మ ఆలయంలోకి చేరుకోగానే బజారువీధిలో నడివీధి గంగమ్మను ఏర్పాటు చేసి పూజలు చేశారు. పుంగనూరు అష్టగంగమ్మలు నల్లరాళ్ల గంగమ్మ, మల్లారమ్మ, స్థలగంగమ్మ, మారెమ్మ, విరూపాక్షమ్మ ఆలయాల్లో ఉదయం నుంచి ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు తీర్చుకోవడంతో ఆలయాలు కిక్కిరిశాయి. భక్తులు అమ్మవారికి టెంకాయలు, జంతుబలులు, పూలు, నిమ్మకాయలు, గెరిగెలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రాంపల్లె, శ్రీవిరూపాక్షి మారెమ్మ విగ్రహాలను చాందినీబండ్లపై ఏర్పాటు చేసి ఊరేగించారు. జాతర సందర్భంగా పట్టణంలో భారీగా మద్యం అమ్మకాలు జరగ్గా, కర్ణాటక మద్యం జోరుగా విందుల్లో కనిపించింది. అమ్మవారిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్, పుంగనూరు పరిసర ప్రాంతాల్లోని ప్రముఖులు, రాజకీయనాయకులు, అధికారులు, ప్రజలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.