రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేపట్టబోయే ఎలాంటి ప్రచారానికైనా సంబందిత ఎన్నికల అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని శ్రీకాకుళం జిల్లా ఎన్నికల అధికారి, శ్రీకాకుళం కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ స్పష్టం చేశారు. లోక్‌సభకు జిల్లా ఎన్నికల అధికారి, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అక్కడి ఆర్వోలు అనుమతి ఇస్తారని తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియామాలపై రాజకీయ పార్టీలకు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రచార అనుమతులకు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో ఏకగవాక్ష విధానం ద్వారా అనుమతులు ఇస్తామన్నారు. వివరాలు సక్రమంగా ఉంటే 24 గంటల్లో కూడా అనుమతులు జారీ చేస్తామని తెలిపారు. సువిధ యాప్‌లో లేదా ఎంపీ అభ్యర్థులు కలెక్టరేట్‌లోని సింగిల్ విండో విభాగంలో, ఎమ్మెల్యే అభ్యర్థులు అయా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఇప్పటివరకు 150కిపైగా దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. ఈ నెల 14 వరకు కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు ఫారం-6 సమర్పించవచ్చన్నారు. సి-విజిల్ బృందాలకు ఫిర్యాదు అందిన వంద నిమిషాల్లోనే 95శాతం పరిష్కరించామన్నారు. సమావేశంలో డీఆర్వో ఎం.గణపతిరావు పాల్గొన్నారు.