టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి జిల్లా పర్యటన కొనసాగుతోంది. మండుటెండను కూడా లెక్క చేయకుండా భువనేశ్వరిని కలిసేందుకు భారీగా టీడీపీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ది కోసం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడ్డారన్నారు. వైసీపీ రాక్షసపాలనలో టీడీపీ కార్యకర్తలను చంపడం, హింసించడం, ఇబ్బందులు పెట్టడం అలవాటుగా మారిందని విమర్శించారు. వైసీపీ చేసే ప్రతీ తప్పును చంద్రబాబుపై నెట్టేస్తున్నారని మండిపడ్డారు. గంజాయి, ఇసుక, భూకబ్జాలు, కల్తీ మద్యం మాఫియా ముఠాలలో ఏపీని వైసీపీ ముందు వరుసలో నిలబెట్టిందని భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఈరోజు ఉదయం కడప, నంద్యాల జిల్లాలకు చేరుకున్న భువనేశ్వరి ముందుగా నగరంలోని 44 డివిజన్ చమ్ముమియాపేటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా చెండ్రాయుడు అనే భాదితుడి కుటుంబాన్ని పరామర్శించారు. చెండ్రాయుడు చిత్రపటానికి పూలమాలవేసి భువనేశ్వరి పరామర్శించారు.