రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. దక్షిణ మధ్య రైల్వే.. ప్రయాణికులకు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై క్యూ ఆర్ కోడ్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ సేవల ద్వారా కౌంటర్ల వద్ద రద్దీ తగ్గింది. సాధారణ రైల్వే టికెట్‌లను క్యూఆర్ కోడ్ ద్వారా బుక్ చేసుకొనే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఫస్ట్ ఫేజ్‌లో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని 14 స్టేషన్లలో ఉన్న 31 కౌంటర్లలో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
రైల్వేశాఖ డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ సేవలను ప్రారంభించింది. జనరల్ బుకింగ్ కౌంటర్లలో ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి నిమిషాల్లో వ్యవధిలోనే ట్రైన్ టికెట్ పొందవచ్చు. ఈ విధానం ద్వారా చిల్లర సమస్య కూడా ఉండదు. తొలి దశలో భాగంగా.. సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట , వరంగల్ , బేగంపేట మంచిర్యాల, లింగంపల్లి, హైటెక్ సిటీ, జేమ్స్ స్ట్రీట్, మహబూబాబాద్, బెల్లంపల్లి, ఫతేనగర్ బ్రిడ్జ్, సిర్పూర్ కాగజ్ నగర్, వికారాబాద్ రైల్వే స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే యూ.టి.ఎస్. (జనరల్ బుకింగ్) కౌంటర్లలో మాత్రమే క్యూఆర్ కోడ్ సదుపాయంతో అన్‌రిజర్వ్ టిక్కెట్లు కొనుగోలు చేసుకునే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.