టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి అంబటి రాంబాబు ఓ రేంజులో సెటైర్లు వేశారు. సత్తెనపల్లి ప్రజాగళం సభలో చంద్రబాబు తనపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. మంత్రి అంబటికి క్యూసెక్కులకు, టీఎంసీలకు తేడా తెలియదన్న చంద్రబాబు.. పండగలకు డ్యాన్స్ వేయడం మాత్రం వచ్చంటూ శనివారం సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు అంబటి. తాను పండగలకు మాత్రమే డ్యాన్స్ వేస్తానని.. బాబూ, పవన్ కళ్యాణ్ పొలిటికల్ డ్యాన్సర్లు అంటూ విమర్శించారు.
" ప్రతి ఒక్కడూ రాంబాబు డాన్స్ వేస్తున్నాడు అంటున్నారు. మీ పక్కన ఉండే పవన్ కల్యాణ్ డాన్సులు వేయడం లేదా? డబ్బుల కోసం పవన్ కళ్యాణ్ సినిమాల్లో డ్యాన్సులు వేస్తున్నాడు. నేనేమీ డబ్బుల కోసం వేయడం లేదుగా. ప్రతి సంవత్సరం భోగి పండుగ రోజు నేను నా సోదరులు, సోదరీమణులతో ఆనంద తాండవం చేస్తా. నేను పండక్కి డాన్స్ వేస్తాను తప్ప..రాజకీయ డాన్సులు వేసే స్వభావం నాకు లేదు. కానీ చంద్రబాబు, పవన్ కళ్యా్ణ్ అలా కాదు. పొలిటికల్ డ్యాన్సర్లు. కాసేపు మోదీతో డ్యాన్స్ చేస్తారు. పార్టీలు మారుతూ డాన్స్ చేసే పొలికల్ డాన్సర్లు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ " అని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
మరోవైపు తాము వదిలేసిన వాళ్లకు టికెట్లు ఇచ్చుకునే స్థాయికి చంద్రబాబు దిగజారారని అంబటి రాంబాబు విమర్శించారు.
"మేం వదిలేసిన వాళ్లకు టికెట్లు ఇచ్చుకుని చంకలు గుద్దుకుంటున్నారు.సత్తెనపల్లిలో చంద్రబాబు పక్కన లావు కృష్ణదేవరాయలు, కన్నా లక్ష్మీనారాయణ, జంగా కృష్ణమూర్తి ఎవరు? రాజకీయంగా వారు ఎక్కడ పుట్టారు? ఎక్కడ పదవులు అనుభవించారు? ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు? మేం వదిలేసిన వాళ్లను, మేం కాదన్న వాళ్లను, మాకు పనికిరాని వాళ్లను పక్కన పెట్టుకుని చంద్రబాబు చంకలు గుద్దుకుంటున్నాడు" అని అంబటి విమర్శించారు.
మరోవైపు చంద్రబాబు సభలలో నారా లోకేష్ కనిపించకపోవటంపైనా అంబటి రాంబాబు స్పందించారు. మంగళగిరి నుంచి పక్కకు వెళ్తే ఓడిపోతాననే భయంతో లోకేష్ మంగళగిరిలోనే మకాం వేశారంటూ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ రెండు రోజులు ప్రచారం చేస్తే.. ఐదు రోజులు పడుకుంటున్నాడంటూ సెటైర్ వేశారు. పవన్ కళ్యాణ్‌కు జ్వరం వచ్చిందట..ఎందుకయ్యా నీకు రాజకీయాలు? పవన్ పిఠాపురంలో లాక్ అయిపోయాడంటూ అంబటి విమర్శించారు.