సంప్రదాయినీ.. సుప్పినీ.. సుద్ధపూసనీ.. అన్న పాటకు ఈ భక్తుడు అచ్చంగా సరిపోతాడు. ఎంతో భక్తి ఉన్నవాడిలా గుడికి వచ్చాడు. నిండు అలంకారణతో దర్శనమిస్తున్న అమ్మవారికి మనస్పూర్తిగా దండం పెట్టుకున్నాడు. అయితే.. ఆ భక్తుడు దండం పెట్టుకుంది తన మొక్కు తీర్చమనో.. కష్టాలు గట్టెక్కించమని వేడుకునేందుకు కాదండోయ్.. "నా కష్టాలు గట్టెక్కేందుకు నీ నగలు కొట్టేయటం తప్పా.. నాకు ఇంకో మార్గం కన్పించట్లేదు.. నన్ను క్షమించు తల్లీ.. ఈసారి ఇలా కానిచ్చేస్తున్నా.. అంతా బాగుంటే భవిష్యత్తులో ఇలాంటిదే ఇంకోటి చేయిస్తా.. అంటూ దొంగ మొక్కు మొక్కుకున్నాడు." ఇంకేముంది.. అటూ ఇటూ చూసి అమ్మవారి మెడలో ఉన్న మంగళసూత్రాన్ని లటుక్కున లాగేసి.. జేబులో వేసుకుని ఎవరి కంట పడకుండా మాయమయ్యాడు.
మనుషులెవ్వరూ చూడకపోయినా.. ఆ అమ్మవారు కూడా కానకపోయినా.. అక్కడే ఉన్న నిఘా నేత్రం మాత్రం మొత్తం తతంగాన్ని రికార్డు చేసింది. ఈ దొంగ భక్తుని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులోని సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి ఆలయంలో తాజాగా చోరీ జరిగింది. దర్శనం కోసం భక్తుడిలా వచ్చిన ఓ వ్యక్తి.. అమ్మవారి మెడలో ఉన్న పది కాసుల మంగళసూత్రాన్ని ఎత్తుకెళ్లిపోయాడు.
ముఖానికి మాస్క్ ధరించి.. గర్భగుడి దగ్గరికి వచ్చి.. అమ్మవారిని కళ్ల నిండుగా చూసుకుని దండం పెట్టుకున్నాడు. మూర్తీభవించిన అమ్మవారిని దర్శించకుండా.. ఆమె మెడలో ధగధగ మెరిసిపోతున్న నగలపై ఆ భక్తుని కళ్లు పడ్డాయి. దీంతో.. ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. అసలే అమ్మవారు.. ఇలా చేయటం కరెక్ట్ కాదు అనుకున్నాడో ఏమో.. కాసేపు తచ్చాడాడు. ఇంతలోనే.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదనుకున్నాడో ఏమో.. అటూ ఇటూ చూశాడు. ఎవరూ లేరని నిర్ణయించుకుని.. క్షణాల్లోనే గర్భగుడిలోకి వెళ్లి ధైర్యంగా అమ్మవారి మెడలోని మంగళసూత్రాన్ని లాగేసి జేబులో వేసుకుని వెళ్లిపోయాడు.
అయితే.. ఇందుకు సంబంధించిన మొత్తం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే.. ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.