ఎన్నికల వేళ ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనకాపల్లి ఎంపీ స్థానానికి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న సీఎం రమేష్ మీద కేసు నమోదైంది. సీఎం రమేష్, చోడవరం అభ్యర్థి రాజుతో పాటు మరో ఆరుగురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి సీఎం రమేష్‌కు 41ఏ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారు.ఈనెల 9న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.
అసలేం జరిగింది..?
చోడవరంలో బుచ్చిరాజు అనే వ్యక్తి హోల్‌సేల్ టైల్స్, మార్బుల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే ఆయన జీఎస్టీ సరిగ్గా కట్టడంలేదన్న సమాచారంతో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన అధికారుల బృందం గురువారం తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలోనే ఆ వ్యాపారి సీఎం రమేష్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆయన తన అనుచరులతో హుటాహుటిన అక్కడికి చేరుకుని అధికారులను నిలదీశారు. సమాచారం ఇవ్వకుండా ఎలా తనిఖీలు చేస్తారంటూ వారిని ప్రశ్నించారు.
దీంతో సీఎం రమేష్ తమ విధులకు అడ్డుపడ్డారని, బెదిరించారంటూ ఏపీ రెవెన్యూ ఇంటిలిజెన్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా చోడవరం పోలీసులు సీఎ రమేష్ మీద కేసు నమోదు చేశారు. సీఎం రమేష్‌తో పాటు చోడవరం టీడీపీ అభ్యర్థి కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, టైల్స్ వ్యాపారి బుచ్చిరాజు, రామకృష్ణలతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది.
డీఆర్ఐ అధికారుల ఫిర్యాదు ఆధారంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన చోడవరం పోలీసులు.. శనివారం రాత్రి సీఎం రమేష్ 41ఏ నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్ 9న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే కేసుకు సంబంధించి సీఎం రమేష్ వెర్షన్ మరోలా ఉంది. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆ వ్యాపారిని కోటి రూపాయలు అడిగారని.. ఇవ్వకపోవడంతో కక్ష సాధిస్తున్నారంటూ సీఎం రమేష్ ఆరోపిస్తున్నారు. అలాగే ఆ వ్యాపారి ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరారని.. అందుకే కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని చెబుతున్నారు.
మరోవైపు సీఎం రమేష్ ఆరోపణలను ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఖండించారు.సీఎం రమేష్‌తో పాటు టైల్స్ కంపెనీ యజమాని బుచ్చిబాబుపై పరువు నష్టం దావా వేయనున్నట్లు తెలిపారు.కడప రౌడీయిజం ఉత్తరాంధ్రలో చేద్దామని చూస్తే తాము చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.