ఏపీలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మండే ఎండలతో జనం విలవిల్లాడుతున్నారు. పగలు పది దాటిందంటే ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు జడుసుకుంటున్నారు. ఏప్రిల్ నెల ప్రారంభంలోనే ఏపీలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం ఏడు జిల్లాలలో దాదాపుగా 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనకాపల్లి జిల్లా రావికమతం, నంద్యాల జిల్లా, బ్రాహ్మణ కొట్కూరు, పల్నాడు జిల్లా రావిపాడు, ప్రకాశం జిల్లా తోకపల్లెలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా చోట్ల 41 నుంచి 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదే సమయంలో మండే ఎండలతో ఇబ్బంది పడుతున్న ఏపీప్రజలకు చల్లనివార్త చెప్పింది. ఆదివారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాలలో ఈ మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షాల కారణంగా పలుచోట్ల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గత పదిరోజులుగా పెరిగిన ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న జనానికి.. ఈ వార్త కాస్త ఉపశమనం కలిగించిందని చెప్పొచ్చు.
మరోవైపు భానుడి ప్రతాపం నేపథ్యంలో ఆరోగ్య నిపుణులు, వాతావరణ శాఖ అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం నాలుగు వరకూ ఎండలో బయట తిరగొద్దని సూచిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు వీలైనంత వరకూ ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నారు. ఇక పనుల నిమిత్తం బయట తిరిగే వారు గొడుగులు, లేదా క్యాప్‌లు ధరించాలని.. వదులైన దుస్తులు వేసుకోవాలని చెబుతున్నారు. మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలని.. వీలైతే మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తాగుతూ ఉండాలని చెబుతున్నారు. వడదెబ్బ కారణంగా అక్కడక్కడా మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో.. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.