మోసపోయేవాళ్లు ఉన్నంత కాలం మోసం చేసేవాళ్లు ఉంటారని..అదేదో సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఈ స్టోరీ చదివిన తర్వాత మీరు కూడా దీనితో ఏకీభవిస్తారు. అలాగే ఇలాంటోళ్లు కూడా ఉంటారా అని కూడా ముక్కున వేలేసుకుంటారు. నాగరికత పెరిగింది, 5 జీ వచ్చేసింది.. పక్క గ్రహాల మీద ఇళ్లు కట్టుకునే ఆలోచన వరకూ మనిషి మెదడు ఎదిగిపోయింది కానీ.. కొన్ని కొన్ని విషయాలు వింటే, కొన్ని స్టోరీలు చదివితే మనమింకా చాలా ఎదగాలని అనిపించకమానదు. ఎందుకంటే మూఢనమ్మకాల విషయంలో మనిషి ఇంకా చాలా ఎదగాల్సి ఉంది. కాలం మారుతున్నా, తరాలు మారుతున్నా కూడా ఈ మూఢనమ్మకాల విషయంలో మనిషి ఇంకా వెనుకబడే ఉన్నాడు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరిగిన ఓ ఘటన చూస్తే ఇది నిజం అనిపించకమానదు. ఎలుగుబంటి పురుషాంగం తింటే పురుషుల్లో లైంగిక శక్తి పెరుగుతుందని ఓ అపోహ జనాల్లో ఉంది. కరెక్ట్‌గా దాన్నే క్యా్ష్ చేసుకునేందుకు ప్రయత్నించింది ఓ బ్యాచ్. ఎలుగుబంటిని చంపి.. దాని మాంసాన్ని విక్రయించేందుకు ప్లాన్ చేశారు.కానీ సీన్ ఆఖర్లో పోలీసుల ఎంట్రీతో ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని శివపురం గ్రామానికి చెందిన ఏసురత్నం, శిఖామణి, సుద్గుణరావు, సాయికుమార్ అనే నలుగురు వ్యక్తులు విద్యుత్ తీగలు ఏర్పాటు చేశారు . అయితే వీరు ఏర్పాటు చేసిన కరెంట్ వైర్లు తగిలి ఓ మగ ఎలుగుబంటి చనిపోయింది. అయితే ఎలుగుబంటి మాంసాన్ని క్యాష్ చేసుకునేందుకు ఈ నలుగురు ప్రయత్నించారు. ఎలుగుబంటి పురుషాంగం, మాంసం తింటే పురుషుల్లో పటుత్వం పెరుగుతుందని ఆశచూపి.. ఓ వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆత్మకూరులోని ఓ లాడ్జిలో మకాం పెట్టారు.
అయితే ఊహించని విధంగా వీరి వ్యవహారం పోలీసులకు చేరింది. దీంతో లాడ్జిలో తనిఖీలు చేసిన పోలీసులు.. ఓ వ్యాపారితో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఎండ బెట్టిన ఎలుగుబంటి అవయవాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అనంతరం రిమాండ్ కోసం నంద్యాల సబ్ జైలుకు తరలించారు. అయితే ఎలుగుబంటి మాంసం తింటే పటుత్వం పెరుగుతుందనేది ఒట్టి అపోహ మాత్రమేనని ఫారెస్ట్ అధికారులు చెప్పారు. ఇలాంటి అపోహలతో వన్యప్రాణుల ప్రాణాలు తీస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.