తన సామాజికవర్గానికి చెందిన టీడీపీలో చేరుతున్నారనే విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆగమేఘాల మీద వారివద్దకు చేరుకుని వద్దని బతిమిలాడారు. అంతేకాదు, మీరు పార్టీని వీడితే తాను పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పారు. అయినాసరే వారు ససేమిరా అన్నారు. తమకు పార్టీలో గౌరవం లేదంటూ మొండికేశారు. చివరకూ చేసేదిలేక ఆయన నిరాశతో వెనుదిరిగారు. విచిత్రమైన ఈ సన్నివేశం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గంలో గురువారం చోటుచేసుకుంది.
తమ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు టీడీపీ చేరుతున్నారనే విషయం తెలుసుకుని నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి యడం బాలాజీ హుటాహుటిన గురువారం మార్టూరులోని పాండురంగస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ ప్రాంతంలో బాలాజీ సామాజికవర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండటంతో.. నాకు పార్టీ టిక్కెట్ ఇస్తే సొంత మనుషులే ఇలా చేస్తే నా పరిస్థితి ఏమిటి? మీరు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీలో చేరొద్దని నాయకులను వారించారు. అయితే వాళ్లు తాము ఏ పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీలో ఉండబోమని, పార్టీలో తమకు గౌరవం లేదని తేల్చిచెప్పారు. ఇక పార్టీలో ఉండలేమని, వీడతామని వారంతా స్పష్టం చేశారు. అయినా సరే, వారిని బయటకు వెళ్లనీయకుండా తన వర్గీయులతో గుడి వద్దే నాలుగు గంటలపాటు ఉన్నారు.
చివరకు వాళ్లు కూడా వెనక్కి తగ్గలేదు. సుమారు వంద మంది ఇసుకదర్శిలోని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కార్యాలయానికి బయలుదేరటంతో చేసేది లేక యెడం బాలాజీ అక్కడి నుంచి వెనుదిరిగారు. తన అనుచరులు టీడీపీలో చేరితే ఇక నా పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని అన్నట్టు తెలుస్తోంది. అలాగైతే తాను పోటీ చేయలేనని బాలాజీ అన్నట్లు సమాచారం.