పదో తరగతి పబ్లిక్ పరీక్ష పత్రాల మూల్యాంకం తుది దశకు చేరుకుంది. ఆదివారంతో 95 శాతం ప్రక్రియ పూర్తవుతుందని, సోమవారం తెలుగు, హిందీ జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారంతో ముగుస్తుందని అధికార వర్గాలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఫలితాలు ఈ నెల 25న ప్రకటించే వీలున్నట్టు విద్యాశాఖ వర్గాల నుంచి సంకేతాలు అందుతున్నాయి. కానీ, దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏదైనా సాంకేతిక ఇబ్బంది ఎదురైతే తప్ప ఏప్రిల్ 30వ తేదీలోగా ఫలితాలను వెల్లడించనున్నట్టు పేర్కొన్నాయి. అయితే, ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్న తర్వాతే ఫలితాలను విడుదల చేస్తారు.
సమాధాన పత్రాల వేల్యూషన్‌కు గతేడాది పెంచిన రేట్ల ప్రకారమే నిధులు విడుదలయ్యాయి. స్పాట్ వాల్యూయేషన్ ముగిసిన వెంటనే సంబంధిత సిబ్బంది బ్యాంకు ఖాతాలకు పారితోషకాన్ని జమ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఒక్కో పేపర్‌కు రూ.6.60 పైసల నుంచి రూ.10లకు పెంచిన విషయం తెలిసిందే. కాగా గతేడాది బకాయి పడిన టీఏ, డీఏ చెల్లింపులకు నిధులు విడుదల కావడంతో గురువారమే టీచర్ల బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు ఏపీ ఓపెన్ స్కూల్స్ దూర విద్య ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 13 నుంచి 17 వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాడి రెగ్యులర్ విద్యార్థులు 6,23,092 మంది పది పరీక్షలకు హాజరుకాగా... వీరిలో బాలురు 3,17,939, బాలికలు 3,05,153 మంది. గతేడాది మే 6న పదో తరగతి ఫలితాలు వెలువడగా.. ఈసారి అంతకంటే ముందే వెలువడనున్నాయి.