ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైపోయింది. పార్టీలన్నీ ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. అభ్యర్థులు అందరూ ఓటర్లను ఆకర్షించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఏపీలోని టీచర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నేపథ్యంలో టీచర్ల విదేశీ ప్రయాణాలకు అనుమతులను రద్దు చేశారు. ఈ మేరకు ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ఎన్నికల్లో టీచర్లకు విధులు అప్పగించనున్నారు. ఈ క్రమంలోనే పోలింగ్ ఏర్పాట్లపై, ఎన్నికల ప్రక్రియపై వారికి అవగాహన కోసం ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే విదేశాలకు వెళ్లేందుకు పొందిన అనుమతులను రద్దు చేస్తున్నారు.
ఏపీ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ తర్వాత నామినేషన్ల స్వీకరణ, పరిశీలన , తిరస్కరణ, ఉపసంహరణ వంటి ప్రక్రియలు ఉంటాయి. ఇవన్నీ పూర్తైన తర్వాత మే 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే మే 13లోపు విదేశాలకు వెళ్లేందుకు టీచర్లు పొందిన అనుమతులను రద్దు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మే 13వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాత విదేశాలకు వెళ్లేందుకు అనుమతులు ఇచ్చేందుకు ఆన్‌లైన్లో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. మరోవైపు జిల్లా విద్యాశాఖ అధికారులు, ఇతర అధికారులు తమ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎవ్వరైనా ఎన్నికల విధులకు నియమితులై ఉండి.. మే 13లోపు విదేశాలకు వెళ్లే వారు ఉంటే అనుమతులు రద్దు చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధులకు నియమితులు కాని వారి విదేశీ ప్రయాణానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
మరోవైపు ఈ ఎన్నికల్లో వాలంటీర్ల సేవలను సైతం వినియోగించుకోవటం లేదు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి కూడా..కీలకమైన విధులకు దూరంగా ఉంచుతున్నారు. కేవలం వేలికి ఇంకు వేసే వంటి పనులను మాత్రమే వారికి అప్పగించాలని ఈసీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులను ఎన్నికల విధులకు ఉపయోగించనున్నారు. ఏపీ ఎన్నికలు మే 13న జరగనుండగా.. జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.