ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. పవన్ కళ్యాణ్ మీద నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ తమను బెదిరిస్తున్నారని, ఎన్నికల్లో పోటీ చేయొద్దంటున్నారని ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జనసేనాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షేక్ జలీల్ జనసేన మీద తీవ్ర ఆరోపణలు చేశారు.
పవన్ కళ్యాణ్ , నాదెండ్ల మనోహర్, ఎంపీ బాలశౌరిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేసినట్లు షేక్ జలీల్ తెలిపారు. అసలు విషయం ఏమిటంటే జనసేన పార్టీది గాజు గ్లాసు గుర్తు కాగా.. ఏపీ ఎన్నికలలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సంఘం బకెట్ గుర్తు కేటాయించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీ చేయవద్దని జనసేన నేతలు తమను బెదిరిస్తున్నారని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ ఆరోపిస్తున్నారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఏకంగా తుపాకీతో బెదిరించాడని షేక్ జలీల్ ఆరోపించారు. గాజు గ్లాస్, బకెట్ గుర్తు ఒకేలా ఉంటుందనే ఉద్దేశంతో జనసేన నేతలు పోటీ చేయవద్దని బెదిరింపులకు దిగుతున్నారని జలీల్ చెప్పారు. ఐదు కోట్లు ఇస్తామని ఆశకూడా చూపారన్న జలీల్.. తాను అందుకు ఒప్పుకోలేదని చెప్పుకొచ్చారు.
మరోవైపు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల్లో కూటమిగా బరిలోకి దిగుతుంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ నేతృత్వంలోని జైభారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలోని యునైటెడ్ ఫ్రంట్‌లో భాగంగా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. పలు పార్టీలతో కలిసి లక్ష్మినారాయణ ఈ కూటమిని ఏర్పాటు చేశారు. అలాగే విశాఖ ఉత్తరం స్థానం నుంచి జేడీ లక్ష్మినారాయణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.