తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్‌లో పలు డాక్యుమెంట్లను అక్కడి సిబ్బంది దహనం చేయడం కలకలంరేపుతోంది. ఈ ఘటనపై టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ డాక్యుమెంట్లను వీటిని తగలబెట్టడాన్ని పలువురు స్థానికులు ప్రశ్నించడంతో పాటు వీడియోలు తీశారని చెబుతున్నారు. ఆ వీడియోలను తమకు ఇవ్వాలని స్థానికులపై సీఐడీ ఒత్తిడి తెస్తున్నట్లు టీడీపీ ఆరోపిస్తోంది. సిట్ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు పత్రాలు తగలబెట్టినట్లు సిబ్బంది చెబుతున్నట్లు టీడీపీ ఆరోపిస్తోంది. హెరిటేజ్ సంస్థ కీలక పత్రాలు సహా ఇతర పత్రాలు అందులో ఉన్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
సిట్ కార్యాలయంలో పత్రాల దహనంపై సమాధానం చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు. బ్రాహ్మణి, భువనేశ్వరి ఐటీ రిటర్న్స్‌లు ఎలా వచ్చాయో చెప్పాలని.. లోకేశ్‌ను విచారణ సమయంలో ప్రశ్నించిన పత్రాలపై ఆనాడే అడిగామన్నారు. ఆ పత్రాలు ఎలా వచ్చాయో ఇంతవరకు సమాధానం చెప్పలేదన్నారు. ఎవరి ఉత్తర్వులతో పత్రాలు తగలబెట్టారో డీజీపీ చెప్పాలని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే పత్రాల దహనం చేశారని.. తప్పుడు పనులు చేసిన అధికారులను వదిలేది లేదన్నారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హెరిటేజ్ సంస్థపై కూడా ఆరోపణలు వచ్చాయి. తాజా ఘటనలో సిట్ ఆఫీస్ దగ్గర కాల్చేసిన డాక్యుమెంట్లు హెరిటేజ్ సంస్థవని అనుమానాలు వ్యక్తం కావడంతో.. ఈ డాక్యుమెంట్లకు ఆ కేసుతో లింక్ ఉందని టీడీపీ చెబుతోంది. ఈ కేసులో నారా లోకేష్‌ను కూడా సీఐడీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాజాగా హెరిటేజ్‌కు సంబంధించిన పత్రాలు తగులబెట్టే సమయంలో వీడియోలు తీయడంతో ఈ ఘటన బయటపడింది. అయితే ఈ అంశంపై సిట్ అధికారులు స్పందించాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.