ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలన్ని ప్రజల్లోకి వెళుతున్నాయి. ఓ వైపు వైఎస్సార్‌సీపీ.. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి.. అలాగే కాంగ్రెస్ పార్టీల మధ్య పోటి నడుస్తోంది. మరో పది రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుండగా.. నేతలు, అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తాజా పరిణామాలతో పాటుగా.. ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలంగాణకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూటమి విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు.. బీజేపీతో పొత్తు వలన కూటమికి కొంత నష్టం ఉందని వ్యాఖ్యానించారు. ఈ ప్రభావం పలితాల్లో కనిపిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి 130 నుంచి 145 అసెంబ్లీ స్థానాలు సాధిస్తుందని చెప్పుకొచ్చారు గోనె ప్రకాశరావు. అలాగే 19 నుంచి 21 పార్లమెంటు స్థానాలు గెలుస్తుందని అంచనా వేశారు. బీజేపీతో పొత్తు వలన అసెంబ్లీ సీట్లకు కొంత నష్టం జరుగుతుందని గోనె చెప్పుకొచ్చారు. చిత్తూరు, కడప జిల్లాలలో మాత్రమే వైఎస్సార్‌సీపీకి మెజార్టీ సీట్లు వస్తాయన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 50 నుంచి 60 వేల మెజార్టీతో గెలుస్తారన్నారు. అక్కడితో ఆగకుండా చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ ఎంపీగా కూడా వెళ్లే అవకాశం ఉందన్నారు.
పవన్ ఎంపీగా గెలుపొందితే.. కేంద్రం కేబినెట్‌లో మంత్రి అవుతారన్నారు. జనసేన పార్టీకి ఇచ్చిన సీట్లను కూడా పవన్ రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేస్తున్నారన్నారు. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే అరాచకం పెరుగుతుందని.. జగన్ ప్రభుత్వం పోవాలని పవన్ త్యాగం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల పర్యటనలో భాగంగా ఉండి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే రామరాజు చేస్తున్న బైక్ ర్యాలీ కార్యక్రమంలో గోనె ప్రకాష్ రావు పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈసారి టీడీపీ అధికారంలోకి రావడం చంద్రబాబుకు చాలా ముఖ్యం అన్నారు. అందుకే ఆయన బీజేపీతో కలిసి కూటమిలో చేరారన్నారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని.. టీడీపీ, జనసేనలు కలవడంతో ఓట్లు చీలకుండా బలం పెరుగుతోందన్నారు. టీడీపీ ఒంటరిగా పోటీచేసినా అధికారం వచ్చేదని.. 90 నుంచి 95 వరకు సీట్లు వచ్చేవని.. కానీ పవన్ కళ్యాణ్ కలవడం కూటమికి ఇంకా బలం పెరిగిందన్నారు. ఏపీ భవిష్యత్తు కోసం పవన్ తన సొంత పార్టీ టికెట్లను కూడా త్యాగం చేస్తున్నారని తెలిపారు. జగన్ మరోసారి సీఎం అయితే ఏపీలో అరాచకత్వం పెరుగుతుందని.. అందుకే జగన్ ప్రభుత్వం పోవాలని పవన్ త్యాగం చేస్తున్నారని అన్నారు. మరోవైపు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు 8 నుంచి 11, బీజేపీకి 5 నుంచి 6, ఎంఐఎంకు 1, బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు రాకపోయినా ఆశ్చర్యపడక్కర్లేదని గోనె ప్రకాశరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.