ఏపీలో జనసేన పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. విజయవాడ పార్టీలో కీలక నేతగా ఉన్న పోతిన మహేష్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో పదవికి, సభ్యత్వానికి ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు తనకు సహకరించిన జనసేన పార్టీ నాయకులకు, వీరమహిళలకు, జన సైనికులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ పశ్చిమ టికెట్‌ను ఆశించగా.. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ నేత సుజనా చౌదరికి కేటాయించారు. అయినా సరే చివరి వరకు సీటు తనకే దక్కుతుందని భావించారు.. కానీ మహేష్‌కు అవకాశం దక్కలేదు. చివరికి అనుచరులతో చర్చించి జనసేన పార్టీకి రాజీనామా చేశారు. పోతిన మహేష్ త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడించనున్నారు. పోతిన మహేష్ మొదటి నుంచి జనసేన పార్టీలోనే కొనసాగుతున్నారు. పార్టీ తరఫున తన వాయిస్ వినిపిస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం పనిచేశారు. 2019 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. అయితే ఈసారి ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తనకు టికెట్ దక్కుతుందని ఆశపడ్డారు. కానీ బీజేపీ, టీడీపీతో కలిసి జనసేన పార్టీ కూటమి ఏర్పాటు కాగా.. బీజేపీకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కేటాయించారు.