ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హీట్ పెరిగింది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి.. ఓ వైపు పార్టీల అధినేతలు.. మరోవైపు అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మేమంతా సిద్ధం సభ.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా గళం సభల్లో పాల్గొంటున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రచారాన్ని ప్రారంభించారు.. జ్వరం నుంచి కోలుకున్న పవన్.. ఆదివారం అనకాపల్లి నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏపీలో తాజా పరిణామాలతో పాటుగా లైవ్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
* వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 11వ రోజైన సోమవారం (ఏప్రిల్ 8)న ఆదివారం రాత్రి బస చేసిన వెంకటాచలంపల్లి ప్రాంతం దగ్గర నుంచి సోమవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. ఉదయం 9.30 గంటలకు వెంకటాచలంపల్లి వద్ద సామాజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్డు వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. చీకటిగల పాలెం మీదుగా మధ్యాహ్నం 3 గంటలకు వినుకొండకు చేరుకొని రోడ్ షోలో పాల్గొంటారు. కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెంలో రాత్రి బసకు చేరుకుంటారు.
* టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు ఉమ్మడిగా రోడ్ షో నిర్వహించనున్నారు. ఇప్పటి వరకూ ఒకే వేదికపై ఇద్దరూ కనిపించారు. రోడ్‌షో మాత్రం ఇప్పటి వరకూ నిర్వహించలేదు. తూర్పుగోదావరి జిల్లాలో తొలిసారి ఒకే వేదికపై చంద్రబాబు, పవన్ కనిపించనున్నారు. నిడదవోలులో ఈ నెల 10న రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తణుకులో రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం రోడ్ మార్గాన సాయంత్రం ఏడు గంటలకు నిడదవోలులో రోడ్‌షో నిర్వహించనున్నారు. ఈ నెల 11న పి.గన్నవరం, అమలా పురం నియోజకవర్గాల్లో ఉమ్మడిగా రోడ్‌షో,సభ ఉంటుందని తెలుస్తోంది.
* మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. ఇవాళ ఎలమంచిలి నియోజకవర్గంలో నిర్వహించే సభలకు హాజరవుతారు. ఈ నెల 9న పిఠాపురం నియోజకవర్గంలో ఉగాది వేడుకల్లో పాల్గొంటారని జనసేన పార్టీ తెలిపింది. అలాగే నెల్లిమర్ల, విశాఖ సౌత్, పెందుర్తి, తెనాలి నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలోనే ఖరారు చేయనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
* వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకే మాదిగల మద్దతు ఉంటుందని ఏపీ ఎమ్మార్పీఎస్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ప్రకటన చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాదిగ కార్పొరేషన్‌కు ఒక్క రూపాయి ఇవ్వలేదని.. లిడ్‌క్యాప్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదిని పెట్టకపోవడం విచారకరమన్నారు. వర్గీకరణపై నోరుమెదపని సీఎం జగన్.. మాదిగ వ్యతిరేకిగా మారారని ధ్వజమెత్తారు. వర్గీకరణపై రెండు రోజుల క్రితం పాలకొల్లులో చంద్రబాబుని కలిసి చర్చించగా.. అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. అసెంబ్లీ సీట్ల విషయంలో మాదిగలను వైఎస్సార్‌సీపీ చిన్నచూపు చూడగా.. టీడీపీ మాత్రం సామాజిక న్యాయం పాటించిందన్నారు. ఈ మేరకు టీడీపీకి మద్దతు తెలుపుతూ 35 మాదిగ సంఘాలు తీర్మానం చేశాయి.