ఏపీలో ఎండలు మండిపోతుండగా.. వేడిగాలులు వీయడంతో పరిస్థితి మారిపోయింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నెలకొన్న ఎండ ప్రభావంతో రాత్రి వాతావరణం వేడిగా కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతల్లో కొత్తరికార్డులు నమోదయ్యాయి. ఆదివారం నంద్యాల జిల్లా చాగలమర్రి, నెల్లూరు జిల్లా కలిగిరిలో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప జిల్లా కాజీపేట, సింహాద్రిపురంలో 45.6, బాపట్ల జిల్లా జే పంగులూరులో 45.5, కర్నూలు జిల్లా ఆలూరు, ప్రకాశం జిల్లా బోట్లగూడూరులో 45.4, పల్నాడు జిల్లా విజయపురిలో 45.2 డిగ్రీలు నమోదైనట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ అల్లూరి జిల్లా చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్రవడగాల్పులు,93మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
రాష్ట్రంలోని 107 మండలాల్లో తీవ్ర గాడ్పులు, 235 మండలాల్లో వడగాడ్పులు వీచాయని.. రానున్న రెండురోజులు కూడా వడగాడ్పులు కొనసాగుతాయని హెచ్చరించింది. ఒడిశా నుంచి ఛత్తీస్‌గఢ్, విదర్భ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించిందని.. దీని ప్రభావంతో సోమవారం కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఏపీలో సాధారణం కన్నా 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూ.గో, విశాఖలో వడగాలుల ప్రభావం ఉంటుందని, అల్లూరి, బాపట్ల, ఏలూరు, గుంటూరు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, పశ్చిమగోదావరి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. మరో రెండు రోజుల్లో ఉత్తర కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.