ప్రస్తుతం దేశంలో ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతుండగా.. ఎన్డీఏ కూటమి పార్టీలు, ఆ కూటమి మద్దతు తెలిపే పార్టీలు.. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తుతున్నాయి. అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లో నరేంద్ర మోదీ.. దేశాన్ని ఎంతో అభివృద్ధి చేయడమే కాకుండా.. ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడుతున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు మాత్రం బీజేపీని, మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన-ఎంఎన్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ కారణంగానే అయోధ్య కల సాకారం అయిందని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ లేకుంటే సుప్రీంకోర్టు ఆదేశించినా కూడా అయోధ్యలో దివ్య రామమందిర నిర్మాణం జరగకపోయి ఉండేదని రాజ్ ఠాక్రే శనివారం వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే మరికొన్ని రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకి.. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన బేషరతుగా మద్దతు తెలుపుతున్నట్లు రాజ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమన్వయం కోసం శివసేన-బీజేపీ-ఎన్సీపీలతో కూడిన మహాయుతి కూటమితో సంప్రదింపులు జరిపే నాయకుల జాబితాను ఎంఎన్ఎస్ సిద్ధం చేస్తుందని రాజ్ ఠాక్రే చెప్పారు. ఈ క్రమంలోనే కూటమి మద్దతు ఉన్న అభ్యర్థుల కోసం ఎంఎన్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వెల్లడించారు.
ఏది ఏమైనా కొన్ని విషయాలను ప్రశంసించాల్సిన అవసరం ఉందని.. ఒకవైపు అసమర్థ నాయకత్వం, మరోవైపు బలమైన నాయకత్వం ఉందని రాజ్ ఠాక్రే తెలిపారు. కాబట్టి తాము నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్లు రాజ్ ఠాక్రే వెల్లడించారు. బీజేపీకి ఎంఎన్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వడంపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన వర్గం విమర్శలు గుప్పించడంపై రాజ్ ఠాక్రే సెటైర్లు వేశారు. ఉద్ధవ్ శివసేన వర్గానికి కామెర్లు ఉన్నాయని అందుకే అలా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మహారాష్ట్రలో తమకు కొన్ని డిమాండ్లు ఉన్నాయని.. మరాఠీకి శాస్త్రీయ భాషా హోదా కల్పించడంతో పాటు రాష్ట్రంలో కోటల్ని పునరుద్ధిరించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ నుంచి వచ్చినందుకు ఆయనకు ఆ రాష్ట్రం అంటే ఇష్టమని.. అదే విధంగా ఇతర రాష్ట్రాలపై కూడా దృష్టిసారించాలని రాజ్ ఠాక్రే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
48 మంది ఎంపీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఏప్రిల్ 19 వ తేదీ నుంచి మే 20 వ తేదీ వరకు మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. నరేంద్ర మోదీ లేకుంటే సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా అయోధ్యలో రామ మందిరం నిర్మించబడేది కాదని పేర్కొన్నారు. మోదీ లేకపోతే అయోధ్య రామ మందిరం ఎప్పటికీ పెండింగ్ సమస్యగా మిగిలిపోయేదని ఠాక్రే అన్నారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన తర్వాత 27 ఏళ్లపాటు రామమందిర నిర్మాణం పెండింగ్‌లోనే ఉందని రాజ్ ఠాక్రే గుర్తు చేశారు.
![]() |
![]() |