ప్రభుత్వం రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరించి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) చెల్లించాల్సిందేనని వైయస్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంకటాచలం మండలం చటపాలెం గ్రామంతో పాటు మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామాల్లో కాకాణి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి నెల 1వ తేదీ పెన్షన్లు పంపిణీ చేస్తూ ఆర్భాటం చేయడం తప్ప ప్రభుత్వం మరే సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. అర్హులైన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేయకుండా, పాత పెన్షన్లు తొలగిస్తూ కూటమి ప్రభుత్వం మోసపూరిత విధానాలు అవలంబిస్తోందన్నారు. తెలుగుదేశం కార్యకర్తల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయడం ప్రజలు తప్పుపడుతున్నారని, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులను పక్కనబెట్టి ఈ విధానం అమలు చేయడం సహించరానిదన్నారు.యూరియా కొరత, బ్లాక్ మార్కెట్ ధరలు, పెట్టుబడి సాయం అందకపోవడం, అకాల వర్షాలు వంటి కారణాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులు పండించిన పంటకు మిల్లర్లు, వ్యాపారులు కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారని, దోపిడీ ఆపాలంటే ప్రభుత్వమే ముందుకు వచ్చి MSP చెల్లిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొక్కుబడిగా ప్రారంభించి, వాస్తవంగా కొనుగోళ్లు చేయకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని హెచ్చరించారు.ప్రస్తుత ప్రభుత్వం కేవలం రూ. 500 కోట్లను ధరల స్థిరీకరణ నిధిగా కేటాయించడం సరిపోదని, రైతుల అవసరాలకు ఇది చాలదని పేర్కొన్నారు. జగనన్న హయాంలో రూ.3,000 కోట్లతో నిధి ఏర్పాటు చేసి రైతులకు ఎంఎస్‌పీతో పాటు పలు విధాలుగా ఆదుకున్నామని గుర్తుచేశారు. ప్రస్తుత పాలనను, గత పాలనను ప్రజలు పోల్చి చూస్తున్నారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa