ఎన్నికల వేళ ఏపీలో చిత్ర విచత్రమైన ఘటనలు చోటు చేసుకుంటాయి. ఏకంగా ముఖ్యమంత్రిపై రాయి విసరడం ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. విజయవాడ సింగ్‌నగర్‌లో ఎన్నికలు ప్రచారం నిర్వహిస్తుండగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై ఆగంతకులు రెండు రాళ్లు విసిరారు. ఈ దాడిలో రాయి తగలడంతో జగన్ కంటికి గాయం అవగా, మరో రాయి పక్కనే ఉన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కు తగిలింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రిపై దాడి జరిగినప్పటికీ సదరు వ్యక్తులు ఇప్పటికీ దొరకకపోవడం గమనార్హం. పట్టిష్టమైన భద్రత ఉన్నప్పటికీ.. చుట్టూతా పోలీసుల వలయాన్ని దాటి మరీ సీఎంకు తగిలేలా దాడి చేయడం అనేది అసంభవం. కానీ అవన్నీ దాటుకుని మరీ ముఖ్యమంత్రిపై కొందరు ఆగంతకులు గులకరాళ్లతో దాడి చేయడం అనేక అనుమానాలను రేపుతోంది. అయితే ఆగంతకులకు పట్టుకునేందుకు పోలీసులు ఎంచుకున్న మార్గం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ముఖ్యమంత్రిపై దాడి జరిగి గంటలు గడుస్తున్నప్పటికీ నిందితులను పట్టుకోకపోవడంతో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు ఓ బంపరాఫర్‌ను ప్రకటించారు. సీఎం జగన్‌పై రాయి వేసిన వారి ఆచూకీ చెబితే రెండు లక్షల బహుమతి అంటూ ఖాకీలు ప్రకటించారు. ముఖ్యమంత్రిపై రాయి దాడి చేసిన వారి వివరాలు తెలపాలంటూ పోలీసులు సోమవారం పత్రికా ప్రకటనను విడుదల చేశారు. నిందితులను పట్టుకునేందుకు దోహదపడే ఖచ్చితమైన సమాచారాన్ని, దృశ్యాలను (సెల్ ఫోన్, వీడియో రికార్డింగ్స్) అందించాలని విజ్ఞప్తి చేశారు.