జనతా దళ్ సెక్యులర్-జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి చిక్కుల్లో పడ్డారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని విమర్శించే క్రమంలో హెచ్‌డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. ప్రస్తుతం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో అమలు చేస్తున్న గ్యారెంటీలతో గ్రామీణ మహిళలు దారి తప్పుతున్నారని కుమారస్వామి వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో మండ్య నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న కుమారస్వామి.. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలకు కారణం అవుతున్నాయి. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో తన తప్పును కుమారస్వామి సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తుమకూరు రోడ్‌షోలో పాల్గొన్న కుమారస్వామి.. కాంగ్రెస్ గ్యారెంటీలపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పథకాల కారణంగా గ్రామాల్లో ఉండే మహిళలు దారి తప్పుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలకు తెరతీశారు. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం బెంగళూరు, మండ్యతోపాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో కుమారస్వామికి వ్యతిరేకంగా మహిళలు నిరసనలు చేపట్టారు. మండ్యలోని సంజయ్ సర్కిల్లో గోబ్యాక్ కుమారస్వామి అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నిరనస తెలిపారు.
దీంతో కుమారస్వామి చేసిన వ్యాఖ్యలకు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కుమారస్వామి మహిళలపట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మాజీ ఎమ్మెల్సీ వీణా అచ్చయ్య మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రక్షణగా నిలుస్తోందన్నారు. మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసేలా కుమారస్వామి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
ఈ వివాదం తీవ్రం అవుతున్న వేళ... ఎట్టకేలకు కుమారస్వామి స్పందించారు. సోమవారం జేడీఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను మహిళలను కించపరచాలని అలా మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీ పేరుతో రూ.2 వేలు ఇచ్చి ప్రతి కుటుంబం నుంచి రూ.10 వేల వరకు లూటీ చేస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. ఇక కుమారస్వామి వ్యాఖ్యలపై స్పందించిన మహిళా కమిషన్.. ఆయనకు నోటీసులు జారీ చేసింది. మహిళల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నాగలక్ష్మి చౌదరి హెచ్చరించారు.