లోక్‌సభ ఎన్నికలకు ముందు ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లాలోని ఛోటైబైథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్పర్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో పలువురు జవాన్లు కూడా గాయాల పాలైనట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, తుపాకులు, మందు గుండు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
కల్పర్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా బలగాల రాకను గమనించిన మావోయిస్టులు.. వారిపైకి కాల్పులు జరిపారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీంతో భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించినట్లు తెలిపాయి. ఈ క్రమంలోనే 29 మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలిపారు. ఆ కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఇన్‌స్పెక్టర్, మరో ఇద్దరు జవాన్లకు కూడా తీవ్ర గాయాలు అయినట్లు తెలిసింది.
సంఘటన స్థలి నుంచి ఏకే 47 తుపాకులు, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను భారీగా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇక చనిపోయిన 29 మందిలో కొంత మంది మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను కాంకేర్ ఎస్పీ ఇంద్రకళ్యాణ్ ఐలెసెల ధృవీకరించారు. లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఈ నెల 19 వ తేదీన అంటే మరో మూడు రోజుల్లో ఉందనగా.. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.