ఏపీలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఇక ప్రచారం అన్నాక ఒక్కో నేతదీ ఒక్కో స్టెయిల్.. కొంత మంది లీడర్లు ప్రశాంతంగానే ఓటర్ల మదిని గెలిచేందుకు ప్రయత్నిస్తారు. తమ మాటల గారడీతో వారి మదిని దోచే ప్రయత్నం చేస్తారు. ఇంకొంతమంది ఆవేశపూరిత ప్రసంగాలతో ఓటర్లను ఆకర్షిస్తూ ఉంటారు. పంచు డైలాగులు, ప్రాసలు విసురుతూ ప్రజలను కట్టిపడేసే ప్రయత్నం చేస్తుంటారు. అలా ప్రసంగించే సమయంలో బోల్తాపడ్డాడు ఓ అభ్యర్థి. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది. అయితే కిందపడిన ఆ అభ్యర్థి వెంటనే పైకి లేచి యధావిథిగా తన ప్రసంగం కొనసాగించారు.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏపీలో ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. మొన్నటి వరకూ ఉమ్మడి కడప జిల్లాలో ప్రచారం నిర్వహించిన షర్మిల.. ఇప్పుడు చిత్తూరు జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చారు. చిత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా పలమనేరులోకి షర్మిల ప్రచారం చేశారు. పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా శివశంకర్ పోటీచేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వాహనం మీద నుంచి మైక్ అందుకుని మాట్లాడుతున్న శివశంకర్ ఆవేశానికి గురయ్యారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు కష్ట కాలంలో పార్టీని వదిలేసి ఇతర పార్టీల్లో చేరిపోయారని శివశంకర్ విమర్శించారు.
ఇక ఇక్కడకు వచ్చిన అందరూ కాంగ్రెస్ కార్యకర్తలేనన్న శివశంకర్.. గతంలో కొంతమంది కాంగ్రెస్, మరి కొంతమంది టీడీపీలో చేరిపోయారని చెప్పుకొచ్చారు. అయితే షర్మిలక్క ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అందరూ వెనక్కి వచ్చేశారని అన్నారు. ఈ క్రమంలోనే అదుపుతప్పి ప్రచార వాహనం మీద నుంచి కిందపడిపోయారు శివశంకర్. దీంతో వైఎస్ షర్మిలతో పాటుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. అయితే ఈ ఘటనలో శివశంకర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.
కిందపడిన శివశంకర్ వెంటనే కాంగ్రెస్ శ్రేణులు, బౌన్సర్ల సహాయంతో తిరిగి వాహనం మీదకు చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే షర్మిల ప్రచారం సమయంలో జరిగిన ఈ ఘటన తాలూకూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంత ఆవేశం ఎందుకు బ్రో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.