ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏ ప్లస్ కన్వెన్షన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 23, 2025, 06:11 AM

క్రీస్తు త్యాగాలను స్మరిస్తూ ఆయన చూపిన బాటను అనుసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. క్రైస్తవులకు సంక్షేమం, ఆర్థిక చేయూత అందించింది తమ ప్రభుత్వమేనని అన్నారు. విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ సాయంత్రం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. క్రిస్మస్ కేట్ కట్ చేసి మత పెద్దలకు తినిపించారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ"క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఏసు ప్రభువు ఈ లోకంలో జన్మించిన రోజును మనం క్రిస్మస్ గా జరుపుకుంటాం. ప్రపంచంలో జరిగే అతిపెద్ద పండుగ క్రిస్మస్. మేరీ మాత కడుపున ఏసు ప్రభువు జన్మించిన పవిత్రమైన రోజు మన అందరికీ పండుగైంది. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే శాశ్వత విలువలను అందించిన ఏసు సందేశం ఎప్పటికీ మార్గదర్శకం. క్రీస్తు బోధనల్ని ఆయన చూపిన బాటను అంతా అనుసరించాలి. పశువుల పాకలో పుట్టి గొర్రెల కాపరిగా పెరిగిన ప్రజా రక్షకుడు ఏసు. నమ్మిన సిద్దాంతం కోసం బలి దానానికి సైతం వెనుకాడని క్రీస్తు గొప్పదనం నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాలి. ప్రభువు తాగ్యాన్ని స్మరించుకోవాలి. శాంతి మార్గాన్ని అనుసరించాలి. ప్రేమ తత్వాన్ని పెంచాలి. ఈర్ష్య, ద్వేషాలకు దూరంగా ఉండి పాపులను సైతం క్షమించాలని బైబిల్ చెబుతోంది" అని ముఖ్యమంత్రి అన్నారు."గత ఐదేళ్లలో అసమర్థ పాలన వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. నేను ఎంత లోతుకు పోతే అన్ని ఎక్కువ సమస్యలు కనపడుతున్నాయి. ఇలాంటి విధ్వంసం నా జీవితంలో చూడలేదు. మనో సంకల్పంతో లక్ష్యాన్ని సాధిస్తున్నాం. 18 నెలల్లో రాష్ట్రం నిలదొక్కుకునే పరిస్థితికి తీసుకొచ్చాం. ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ విజయవంతంగా అమలు చేశాం.క్రైస్తవుల్లో పేద కుటుంబాలు ఉన్నాయి. వారందరికీ ఆర్థిక భరోసా కల్పించాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, తల్లికి వందనం, దీపం, ఉచిత బస్సు పథకం, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం,పాస్టర్లకు గౌరవ వేతనాలు ఇలా అన్ని విధాలా క్రిస్టియన్ మైనారిటీలను ఆదుకుంటున్నాం. ప్రత్యేకంగా క్రైస్తవ సమాజం కోసం రూ. 22 కోట్లు ఖర్చు చేసి,44,812 మంది క్రైస్తవ సోదర సోదరీమణులకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాం. రాష్ట్రంలోని 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నాం" అని వెల్లడించారు.క్రైస్తవుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2014 నుంచి 2018 మధ్య 977 చర్చిలకు రూ.70 కోట్లు మంజూరు చేశాం. వీటిలో 377 చర్చిల నిర్మాణం పనులు పూర్తయ్యాయి. గుంటూరులో క్రిస్టియన్ భవన నిర్మాణం కోసం రూ.10 కోట్లు ఖర్చు చేశాం. మరిన్ని నిధులు విడుదల చేసి ఈ ఏడాది క్రిస్టియన్ భవనాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. జెరూసలేం యాత్రకు వెళ్లే క్రైస్తవ సోదర సోదరీమణులకు కూడా ఆర్థిక సాయం చేస్తున్నాం. వార్షిక ఆదాయంరూ. 3 లక్షల లోపు ఉన్న వారికి రూ. 60,000,రూ. 3 లక్షలకు పైగా ఉన్న వారికి రూ. 30,000 ఇస్తున్నాం. దీని కోసం ఈ ఏడాది రూ.1.50 కోట్లు కేటాయించాం అని చంద్రబాబు తెలిపారు.సమాజ సేవలో క్రైస్తవ సంస్థలు ముందున్నాయి. క్రిస్టియన్ పాఠశాలలు, కాలేజీలు, ఆసుపత్రులు దశాబ్దాలుగా చేస్తున్న సేవలు వెలకట్టలేనివి. ఇవి లక్షల మంది జీవితాల్లో మార్పు తెస్తున్నాయి. మిషనరీ పాఠశాలల్లో చదివి ఎంతోమంది ఎంతో ఉన్నత స్థానాలకు వెళ్లారు. క్రమశిక్షణ, సేవ, నాలెడ్జ్ కు మిషనరీ విద్యా సంస్థలు కేంద్రంగా ఉన్నాయి. గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ, ఆంధ్ర లయోలా కాలేజీ వంటి క్రిస్టియన్ విద్యా సంస్థలు రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నతికి సేవ చేశాయి. ఎన్టీఆర్ కూడా మిషనరీ కాలేజ్ లోనే చదువుకున్నారు. పేదరికం లేని సమాజమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఇందుకోసం నిర్ధుష్ట ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం అని సీఎం చంద్రబాబు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa