ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో పర్యాటకం సురక్షితం అనే భావన పర్యాటకుల్లో కలగాలన్న పవన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 23, 2025, 07:44 AM

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకునే విధంగా ప్రణాళికలకు రూపకల్పన చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు 100 శాతం భద్రతకు భరోసా ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా సురక్షితమన్న భావన పర్యాటకుల్లో కలిగేలా చూడాలని అన్నారు. అందుకోసం టూరిజం సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు సంతోషంగా తిరిగి వెళ్లాలని, ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ తరలి వచ్చినప్పుడు వారికి భద్రమైన పరిస్థితులు కల్పించాలని, మహిళా పర్యాటకుల భద్రతకు ప్రత్యేక విధానం తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి, ఉపాధి కల్పనపై పర్యాటక, దేవాదాయ, ఆర్ అండ్ బి శాఖల మంత్రులు, అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ప్రత్యక్షంగా పాల్గొనగా, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో యువత, గిరిజన ప్రాంతాల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు పర్యాటక శాఖలో అద్భుత అవకాశాలు ఉన్నాయన్నారు. టూరిజం హాట్ స్పాట్లను గుర్తించడం, అక్కడ సౌకర్యాలు మెరుగుపర్చడం ద్వారా దేశ, విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించవచ్చని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో హెలీపోర్టులు ఏర్పాటు చేయవచ్చని, అందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. నిర్ణీత సమయంలో వాటిని అమలు చేయాలని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తాను చాలా సందర్భాల్లో టూరిజం పాలసీపై చర్చించామని వివరించారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా భద్రతకు ఇబ్బంది ఉండదన్న భావన టూరిస్టుల్లో కల్పించాలన్నారు. ప్రకృతిని ఇష్టపడుతూ అటవీ ప్రాంతాల్లో పర్యటించేవారికి తగిన భద్రత అందించాలని ఆదేశించారు. పర్యాటక ప్రదేశాల్లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎకో టూరిజం అభివృద్ధి చేస్తున్న ప్రాంతాల్లో మన సంస్కృతి, సామాజిక పరిస్థితులపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పర్యాటకులతో ఎలా మసలుకోవాలో అనే అంశంపై ఒక ప్రవర్తనా నియమావళి తీసుకువచ్చి, దాన్ని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఉల్లంఘనలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, ముఖ్యంగా హోటల్స్ నిర్వాహకులు, ట్రావెల్స్ నిర్వాహకులు ఈ నియమావళి కచ్చితంగా పాటించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.ప్రకృతి సంపదను వారసత్వ సంపదగా గుర్తించాలని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాల్లో బోట్ రేసులు వంటి వాటిని నిర్వహించడం ద్వారా ఆకర్షించాలని, మంగళగిరి, కొండపల్లి, సిద్ధవటం తదితర కొండ ప్రాంతాల్లో పర్వతారోహణకు అనువైన పరిస్థితులు కల్పించాలన్నారు. మరిన్ని శాఖలను కూడా భాగస్వాముల్ని చేయాలని సూచించారు. తదుపరి సమావేశం జనవరి 6వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు, ఉన్నతాధికారులు అజయ్ జైన్, అమ్రపాలి కాట, శాంతిప్రియ పాండే, రాహుల్ పాండే, శరవణన్, రామచంద్ర మోహన్, శ్రీనివాస్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కృష్ణబాబు, కాంతిలాల్ దండే, హరి జవహర్ లాల్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa