దేశంలోని సామాన్యులకు మరియు వాణిజ్య అవసరాలకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ఉత్పత్తిపై కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, దేశీయ వంటగ్యాస్ ఉత్పత్తిని మరో 10 శాతం మేర పెంచాలని చమురు సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాను మెరుగుపరచడం ద్వారా మార్కెట్లో గ్యాస్ కొరత లేకుండా చూడాలని ఈ సందర్భంగా ప్రధాని సూచించారు.
ఈ నిర్ణయాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా రంగంలోకి దించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), మరియు హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. కమర్షియల్ ఎల్పీజీ వాస్తవ అవసరాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, కంపెనీలు తమ ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునేలా ఈ కమిటీ పర్యవేక్షించనుంది.
ప్రస్తుతం దేశంలోని రిఫైనరీలు అన్నీ యుద్ధానికి ముందు ఉన్న రీతిలోనే పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని కేంద్రం వెల్లడించింది. అంతర్జాతీయంగా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, దేశీయ అవసరాలకు ఇబ్బంది కలగకుండా చమురు సంస్థలు తమ కార్యకలాపాలను వేగవంతం చేశాయి. పెరిగిన ఈ ఉత్పత్తి సామర్థ్యం ద్వారా రానున్న రోజుల్లో గ్యాస్ సిలిండర్ల లభ్యత మరింత సులభతరం కానుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, గ్యాస్ పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కేంద్రం కఠిన హెచ్చరికలు జారీ చేసింది. వంటగ్యాస్‌ను అక్రమంగా నిల్వ చేసినా లేదా బ్లాక్ మార్కెట్‌కు తరలించినా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది. వినియోగదారులకు సక్రమంగా గ్యాస్ చేరవేయడంలో ఏవైనా లోపాలు జరిగితే సంబంధిత సంస్థలు బాధ్యత వహించాల్సి ఉంటుందని, పారదర్శకమైన సరఫరా వ్యవస్థే తమ ప్రాధాన్యతని కేంద్ర ప్రభుత్వం ఉద్ఘాటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa