ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు, వేడిగాలుల తీవ్రత మరింత పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలు ఎండతో ఉడికిపోయాయి. వడగాడ్పులతో జనాలు అల్లాడి పోయారు. ప్రధానంగా ఉత్తర కోస్తాలో గాడ్పుల ప్రభావం ఎక్కువగా ఉంది.. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, పాలకొండ, వీరఘట్టంలో 43.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల జిల్లా బనగానపల్లెలో 43.3 డిగ్రీలు, అల్లూరి జిల్లా యెర్రంపేటలో 43.1, పల్నాడు జిల్లా విజయపురిలో(మాచర్ల), విజయనగరం జిల్లా రాజాంలో 42.8, అనకాపల్లి గడిరైలో 42.7 చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉత్తర కోస్తాలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిశాయి. మంగళవారం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 63 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే శ్రీకాకుళం నుంచి పల్నాడు వరకు 130 మండలాల్లో ఓ మోస్తరు వడగాడ్పులు ఉంటాయని పేర్కొంది. బుధవారం 38 మండలాల్లో తీవ్రవడగాల్పులు,135 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు ఉత్తర కోస్తాలో వడగాడ్పులు వీస్తాయని, రాయలసీమ, దక్షిణకోస్తాలో వేడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
అంతేకాదు ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఓఆర్‌ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలని సూచనలు చేశారు.