పుట్టిన పిల్లలు రకరకాలుగా ఉండటం మనం ఈ మధ్య కాలంలో చాలా చూస్తూనే ఉన్నాం. అయితే కొందరు జన్యు పరమైన లోపాల కారణంగా అవయవాల్లో సరిగా ఎదుగుదల కనిపించదు. మరికొందరు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ పిల్లవాడు మాత్రం పుట్టినప్పటి నుంచి ఒంటిపై వెంట్రుకలతో పుట్టారు. చాలా మందికి శరీరంపై వెంట్రుకలు ఉన్నా.. ఈ పిల్లాడికి మాత్రం అందరికన్నా మరింత ఎక్కువగానే ఉన్నాయి. ముఖంతోపాటు శరీరం మొత్తం వెంట్రుకలతో కప్పబడి ఉంది. అయితే అతని తల్లి మాత్రం ఓ అనుమానం వ్యక్తం చేసింది. తన కుమారుడికి ఇలా కావడానికి.. తాను గర్భవతిగా ఉన్నపుడు పిల్లి మాంసం తినడంతోనే ఇలా జరిగిందని పేర్కొంది.
ఈ సంఘటన ఫిలిప్పీన్స్ దేశంలో చోటు చేసుకుంది. అల్మా అనే మహిళకు జారెన్ గమోంగన్ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే అతని ముఖం, శరీరం మొత్తం పెద్ద పెద్ద వెంట్రుకలతో ఉంది. దీనిని అరుదైన 'వేర్‌వోల్ఫ్ సిండ్రోమ్'గా పిలుస్తారని డాక్టర్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు దాదాపు 50 నుంచి 100 వరకు ఉంటాయని అంచనా. అయితే జారెన్ గమోంగన్.. తన కడుపులో ఉన్నపుడు అల్మాకు అడవి పిల్లులను తినాలనే కోరిక ఎక్కువగా ఉండేదని తెలిపింది.
అంతేకాకుండా ఫిలిప్పీన్స్‌లోని అపయావో ప్రాంతంలో పిల్లితో చేసే వంటకం బాగా ఫేమస్ కావడంతో చివరికి ఒక రోజు నల్లపిల్లిని తీసుకువచ్చి అల్మా వండుకుని తిన్నది. అయితే ఆ సమయంలో ఆమెకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు. కానీ బిడ్డ పుట్టిన తర్వాత తన కుమారుడి మెడ, వీపు, చేతులు, ముఖంపై బాగా వెంట్రుకలు రావడంతో ఆమెకు కొత్త అనుమానం మొదలైంది. జారెన్ గమోంగన్ ఒంటిపై ఎలుగుబంటి మాదిరిగా జుట్టుతో ఉండటంతో.. తాను పిల్లి మాంసం తిన్నందుకే ఇలా జరిగిందని.. చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందడం మొదలు పెట్టింది. దీంతో అల్మాతోపాటు స్థానికులు కూడా అదే నమ్మడం ప్రారంభించారు. అయితే అల్మా పిల్లి తినడం వల్లే ఆమె కుమారుడి శరీరంపై వెంట్రుకలు వచ్చాయని చెప్పడానికి మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు.
ఇక జారెన్ గమోంగన్ కంటే ముందు అల్మాకు ఒక కుమార్తె కూడా ఉంది. అయితే ఆమెకు ఇలాంటి పరిస్థితి కాకుండా అందరిలాగానే సాధారణంగా ఉంది. తన కుమారుడికి ఉన్న ఆ జబ్బును తగ్గించేందుకు ఎంతమంది డాక్టర్లను.. ఎన్ని ఆస్పత్రులను సంప్రదించినా ఫలితం దక్కలేదు. జారెన్‌కు మెడికల్ టెస్టులు చేసిన డాక్టర్లు.. హైపర్‌ట్రికోసిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇక అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ డెర్మటాలజీ ప్రకారం..ఈ హైపర్‌ట్రికోసిస్ అనే వ్యాధి సాధారణంగా మానవుడికి ఉండే జుట్టు కంటే అధికంగా ఏ భాగంలోనైనా పెరగొచ్చని.. ఇది అరుదైన వ్యాధి అని చికిత్స కూడా లేదని తేల్చి చెప్పారు.
ఈ పరిస్థితి ఉన్నప్పటికీ.. జారెన్ గమోంగన్ చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్‌గా ఉండేవాడని తల్లి అల్మా తెలిపింది. ఒక్కోసారి వాతావరణం వేడిగా ఉన్నపుడు శరీరంపై బాగా వెంట్రుకలు ఉండటంతో దురద పెడుతుందని తన కుమారుడు చెప్పి వాపోతున్నాడని అల్మా వెల్లడించింది. అయితే ఆ వెంట్రుకలను కత్తిరించేందుకు తాను చాలా సార్లు ప్రయత్నించానని.. అయితే అవి పొడవుగా మందంగా ఉండటంతో మరింత ఎక్కువగా దట్టంగా పెరుగుతున్నట్లు తెలిపింది. వీటికి శాశ్వత పరిష్కారం లేనప్పటికీ.. లేజర్ హెయిర్ రిమూవల్ వంటి చికిత్సల ద్వారా అధిక జుట్టు పెరుగుదలను కొంతవరకు నివారించవచ్చని డాక్టర్లు సూచించారు. దీంతో అల్మా, ఆమె భర్త.. ఆ ఆపరేషన్‌కు కావాల్సిన డబ్బుల కోసం నిధులు సమకూర్చే పనిలో పడ్డారు.