జనసేన అధినేత పవన్ కల్యాణ్ భద్రతపై ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల తేదీల ప్రకటన వెలువడిన నాటి నుంచి ఆయన విస్తృతంగా ప్రజాబాహుళ్యంలో తిరుగుతున్నారు. రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడిగా, సినీ హీరోగా పవన్‌కు ఉన్న ఫాలోయింగ్ చెప్పనవసరం లేదు. ఆయనతో ఫొటో దిగాలనుకునే అభిమానులు లక్షల్లో ఉంటారు. ఆయన కనిపించగానే ఆ అభిమానం ఉప్పొంగుతుంది. ఆయన్ను దగ్గరగా చూడాలన్న ఉద్వేగం బారికేడ్లను దాటి ముందుకు ఉరుకుతుంది. దానికి అడ్డుకట్ట వేయడానికి, క్రమబద్దీకరించడానికి నిలబడాల్సిన పోలీసులు కనుచూపు మేర కనిపించడం లేదు. ఉన్న కొద్దిమందీ అది తమపని కాదన్నట్లు పల్లీలు తింటూ దూరంగా కూర్చుండిపోతున్నారు. ఈ నెల 1న పిఠాపురంలో పర్యటించిన పవన్, అక్కడ సభలో మాట్లాడుతూ, ‘నాకూ అభిమానులతో ఫొటోలు దిగాలని ఉంటుంది. కాని, వారితో పాటు కొన్ని అసాంఘిక శక్తులు కలిసిపోయి వస్తున్నాయి. వాళ్లు నన్ను, నా సిబ్బందిని సూదులతో గుచ్చుతున్నారు. బ్లేడ్లతో కోస్తున్నారు. భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి’ అని అన్నారు. పవన్ స్వయంగా చేసిన ఆ ప్రకటనతో పార్టీ నాయకుల్లో అధినేత భద్రతపై ఆందోళన మొదలయింది. పవన్‌కు భద్రత కల్పించాలంటూ పోలీసులకు అనేకసార్లు చేసిన విన్నపాలు బుట్టదాఖలవడంతో ఆయనకు రక్షణగా ప్రైవేటు భద్రతా సిబ్బంది, జనసైనికులే నిలుస్తున్నారు. కాగా, తాడేపల్లిగూడెం సభలో పోలీసులు తీరు పార్టీ నాయకులకు భయం కలిగించింది. వేల మంది జనాభా ఉన్న సభ దగ్గర పట్టుమని 10 మంది పోలీసులు కూడా లేదు. దీంతో జనం ఒక్కసారి బారిగేడ్లు విరగొట్టుకుని ప్రధాన వేదిక వద్దకు వచ్చేశారు. ఆ సభలో ఎన్‌ఎ్‌సజీ సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎం చంద్రబాబు కూడా పాల్గొన్నారు. భారీ భద్రత కలిగిన వ్యక్తి ఉన్న సమయంలో కూడా పోలీసులు చేతులెత్తేశారు. జనం ఒక్కసారిగా ప్రధాన వేదిక వద్దకు రావడంతో ఇరుపార్టీల నేతలూ ఒకింత ఒత్తిడికి లోనయ్యారు. అప్పుడు చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బందితో పాటు, పవన్ కల్యాణ్ ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది వారిద్దరి చుట్టూ వలయంగా ఏర్పడ్డారు. ప్రతి సందర్భంలోనూ ఇలాంటి భద్రతా లోపాలతో కూడిన అనుభవాలే జనసేనాకి ఎదురవుతున్నాయి. పవన్ పర్యటనల్లో, బహిరంగ సభల్లో ప్రధాన వేదిక వద్ద ఆయన భద్రతకు పోలీసులు ఎలాంటి ముందస్తు చర్యలూ తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే సుమారు 300 మంది ప్రైవేటు భద్రతా సిబ్బంది, 100 మంది జనసైనికులు వలంటీర్లుగా ఏర్పడి సేనానికి రక్షణగా నిలిస్తున్నారు. అయితే తాజా ఘటనల నేపథ్యంలో పోలీసులు స్పందించాలని, పవన్ కల్యాణ్ రక్షణపై దృష్టి సారించాలని జనసేన పార్టీ నాయకత్వంతోపాటు, పవన్ కల్యాణ్ అభిమానులూ బలంగా కోరుకుంటున్నారు.