సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వైపునకు మళ్లుతోందా? ఆయనను కేసులో ఇరికించేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారా? దానికి అనుగుణంగానే పోలీసుల దర్యాప్తు సాగుతోందా? అంటే.. జరుగుతున్న పరిణామాలు ఔననే అంటున్నాయి. సీఎం జగన్‌పై జరిగిన గులకరాయి దాడి ఘటనకు సంబంధించి పోలీసుల అదుపులో ఇప్పటి వరకు ఐదుగురు మైనర్లు ఉన్నారు. తాజాగా టీడీపీకి చెందిన వేముల దుర్గారావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుర్గారావు వడ్డెర కాలనీలో ఉంటూ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నారు. కొద్దినెలల కిందటే ఈయన టీడీపీలో చేరారు. తాజాగా దుర్గారావును కూడా అదుపులోకి తీసుకోవడంతో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నవారి సంఖ్య ఆరుకి చేరింది. ముందుగా అదుపులోకి తీసుకున్న ఐదుగురు మైనర్లలో ఒకరు.. గులకరాయి విసిరాడని పోలీసులు లీక్‌లు ఇచ్చారు. తాజాగా మంగళవారం సాయంత్రం ఒక టీస్టాల్ వద్ద ఉన్న దుర్గారావును పేరు అడిగి మరీ జీపులో ఎక్కించుకుని తీసుకెళ్లారని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ దుర్గారావు కనిపించకపోయేసరికి ఆందోళన చెందారు. దుర్గారావుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. దుర్గారావు సోదరుడు ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నారు. దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఇప్పుడు బొండా ఉమాను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.