మచిలీపట్నంలో చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమేనని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జితో మాట్లాడి తోట త్రిమూర్తులుకి బెయిల్ ఇప్పించారని అబద్ధం చెప్పాడని మండిపడ్డారు. శిరోముండనం కేసు 1996లో జరిగిందని, ఆ ఘటన జరిగినప్పుడు తోట త్రిమూర్తులు టీడీపీలోనే ఉన్నారు కదా అని ప్రశ్నించారు. 1995 నుంచి 2020 వరకు తోట త్రిమూర్తులు టీడీపీలో లేరా అని బాబును నిలదీశారు. ఈ కేసులో ముద్దాయిగా ఉన్నప్పుడు త్రిమూర్తులు టీడీపీ నుంచి పోటీ చేసిన విషయాన్ని పేర్ని నాని గుర్తుచేశారు. చంద్రబాబులాగా అసహ్యంగా మాట్లాడే నాయకులు ఎవరైనా ఉంటారా అని మండిపడ్డారు. తనకు బూతులు తిట్టడానికి మంత్రి పదవి ఇచ్చారని అంటున్నారని, తాను ఏనాడు చంద్రబాబు, పవన్‌లను బూతులు తిట్టలేదని చెప్పారు. ఒకవేళ తాను బూతులు మాట్లాడి ఉంటే నిరూపించాలంటూ సవాల్ విసిరారు. బాబుకు వయసు పెరిగింది కానీ.. ఏం మాట్లాడాలో తెలియలేదని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు బందర్‌కు ఏం చేశారని ప్రశ్నించారు. బందర్‌కు పూర్వవైభవం రావడానికి కారణం సీఎం జగన్ అని పేర్ని నాని తెలిపారు. కృష్ణా వర్శిటీ, పాలిటెక్నిక్ కాలేజీలు నిర్మించామన్నారు. పోర్టు పనులు శరవేగంగా జరిగేలా చూస్తున్నామన్నారు. 26వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలిచ్చామని పేర్కొన్నారు. కరోనా సమయంలో తన కొడుకు పేదలకు సేవ చేశాడని తెలిపారు. 75 ఏళ్ల వయసున్న చంద్రబాబువి అన్నీ పాపపు మాటలేనని దుయ్యట్టారు. తన కొడుకు గంజాయి అమ్ముతున్నాడని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు తీరును ప్రశ్నిస్తే నతాను బూతులు నానినా? అని నిలదీశారు.