ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమాన్ని.. తాను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని, మళ్ళీ రాబోయేది వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వమేనని వైయస్ఆర్‌సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే అభ్యర్థి వై. విశ్వేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. విడపనకల్లు మండలం చీకులగురికి, కొట్టాలపల్లి గ్రామాల్లో విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. యువత పూల వర్షం కురిపించారు. అనంతరం ఆయన ఆయా గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ..... ఒకవైపు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ సుపరిపాలన అందిస్తుంటే మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై దోచుకోవడానికి చూస్తున్నాయని మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చాకే ప్రజల కష్టాలు తొలగాయని వివరించారు. 3.లక్షల 70 వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో నేరుగా జమ చేసారని చెప్పారు. ఒక్క చీకులగురికి గ్రామానికే ఈ నాలుగేళ్ళలో 25 కోట్ల రూపాయలు లబ్ది కలిగిందని వెల్లడించారు. సీఎం వైయస్ జగన్ ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని, అనేక గ్రామాలకు రోడ్లు నిర్మించామని చెప్పారు. మీకు మంచి జరిగివుంటేనే ఓటు వేయండని అడిగిన ఏకైక నాయకులు దేశంలోనే వైయస్ జగన్ ఒక్కరే అన్నారు. ప్రజలు కూడా అన్నింటినీ చూడాలని నాడు రైతు, డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిన చంద్రబాబు కావాలో లేక మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలను 99 శాతం అమలు చేసిన వైయస్ జగన్ కావాలో నిర్ణయించుకోవాలని కోరారు. తర్వాత ఇంటింటికి వెళ్లి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే గా తనను ఎంపీ అభ్యర్థి గా శంకర్ నారాయణను ఆశీర్వదించాలని విశ్వేశ్వరరెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.