అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై చిక్కుముడి వీడింది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసేందుకు అంగీకారం తెలిపారు. తొలుత తాను టీడీపీ నుంచి మాత్రమే పోటీ చేస్తానని నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి పట్టుపట్టారు. అయితే, పొత్తుల్లో భాగంగా సీట్ల కేటాయింపు విషయంలో సమస్యలు వస్తుండటంతో.. నల్లమిల్లిని బీజేపీ నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం సూచించింది. అయితే, నల్లమిల్లి అందుకు అంగీకరించలేదు. దాంతో రంగంలోకి దిగిన చంద్రబాబు.. నేరుగా రామకృష్ణారెడ్డితో మాట్లాడారు. ఆ వెంటనే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నల్లమిల్లి ఇంటికి పంపారు టీడీపీ అధినేత. మరోవైపు బుచ్చయ్యతో నారా లోకేష్ కూడా మాట్లాడారు. దీంతో బుచ్చయ్య చౌదరి, బీజేపీ నేతలు కలిసి రామకృష్ణా రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనతో మాట్లాడారు. బీజేపీ నుంచి పోటీ చేయాలని సూచించారు. ఇలా చంద్రబాబు, బుచ్చయ్య చౌదరి, బీజేపీ నేతలు మాట్లాడటంతో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అంగీకరించారు. నల్లమిల్లి ఇవాళో, రేపో బీజేపీలో చేరనున్నారు. అనంతరం బీజేపీ బీఫామ్ తీసుకుని నామినేషన్ దాఖలు చేయనున్నారు.