వివాహేతర సంబంధం ఇద్దరు వ్యక్తులను బలి తీసుకొంది. ఈ ఘటనకు సంబంధించి మార్కాపురం రూరల్ ఎస్‌ఐ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లి గ్రామానికి చెందిన పోతిరెడ్డి సత్యనారాయణరెడ్డి(32) కొంతకాలం నుండి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొద్దిరోజులుగా ఆమె కనిపించకపోవడంతో ఈ నెల 17న తన భార్య కనిపించడం లేదని, ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారిస్తున్న నేపథ్యంలో మండలంలోని చింతగుంట్ల గ్రామ సమీపంలోని పొలాలలో వివాహిత, సత్యనారాయణరెడ్డిలు పురుగుల మందు తాగి మృతి చెందారు. ఘటనా స్థలాన్ని సీఐ ఆవుల వెంకటేశ్వర్లు, రూరల్, పెద్దారవీడు ఎస్‌ఐలు వెంకటేశ్వరనాయక్, వెంకట సైదులు తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఘటనపై మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం వైద్యశాలకు తరలించారు.