అభిప్రాయ భేదాలు వీడి కలసి కదిలితే విజయం తప్పకుండా వరిస్తుందని నారా భువనేశ్వరి టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కుప్పం పర్యటనలో రెండవ రోజైన శనివారం పార్టీ కార్యాలయంలో ఆమె నియోజకవర్గంలోని టీడీపీ ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. టీడీపీ ఒక కుటుంబం లాంటిదని, కుటుంబమన్నాక చిన్నచిన్న విభేదాలు సహజమని, కానీ విజయం వైపు అడుగులేసేటప్పుడు వాటిని పక్కనపెట్టేయాలని హితవు పలికారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు ఒక్కతాటిపైకి వచ్చి పనిచేయాలని పిలుపునిచ్చారు. మే 10వ తేదీ వరకు తానూ ప్రజల్లో ఉంటూ ప్రచారం చేస్తానన్నారు. చంద్రబాబు 7 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారంటే కుప్పం ప్రజలు ఆయనమీద పెట్టుకున్న నమ్మకం ఎటువవంటిదో అర్థమవుతోందన్నారు. నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ సాధించిన బూత్ గల ప్రాంతాన్ని తాను దత్తత తీసుకుని అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. వైసీపీవారు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగవద్దని, జీవితాలను బలిపెట్టుకోవద్దని హితవు పలికారు. అంతకుముందు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు కుప్పం ప్రజలు లక్ష ఓట్ల మెజారిటీ ఇస్తారడానికి ఆయన నామినేషన్‌కు వచ్చిన జన స్పందనే నిదర్శమని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రబాబును నమ్ముకున్న వారెవరూ మోసపోరు అన్నదానికి తాను నిదర్శమని, రాజకీయ నేపథ్యం లేకపోయినా తనను అనేక పదవుల్లో కూచోబెట్టారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నియోజకవర్గ విస్తరణ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సురేశ్, టీడీపీ మున్సిపల్ అధ్యక్షుడు రాజ్‌కుమార్ పాల్గొన్నారు.