ఎంతో అన్యోన్యంగా సాగుతున్న ఆ కుటుంబంలో వివాహేతర సంబంధం ఒక్కసారిగా కలకలం రేపింది. ముగ్గురు పిల్లలు ఉన్న ఆ కుటుంబ పెద్ద మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిని తట్టుకోలేక చిన్నారులతో కలిసి ఆ తల్లి గండిమడుగులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన కడప మండల కేంద్రమైన గాలివీడులో జరిగింది. గాలివీడు ఎస్‌ఐ వెంకటప్రసాద్ కథనం మేరకు... వివరాల్లోకి వెళితే.. వేముల విక్రమ్ అనే వ్యక్తికి రామాపురం మండలం చిట్లూరు పంచాయతీకి చెందిన నాగరాణి (30)తో 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. వివాహమైన కొన్ని సంవత్సరాలు వీరు అన్యోన్యంగా జీవించారు. వీరికి నవ్యశ్రీ (10), దినేశ్ (6,) జాన్వి (3) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. గాలివీడు సచివాలయంలో గ్రామ వలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న వేముల విక్రమ్ భార్య నాగమణి తన ముగ్గురు పిల్లలతో కలిసి మండల కేంద్రంలోని చిలకలూరిపేటలో నివాసముంటున్నారు. అయితే కుటుంబ పోషణకు సరిపడా ఆదాయం లేకపోవడంతో విక్రమ్ వలంటీర్‌గా ఉంటూ ఆటో నడిపేవాడు. ఇదే క్రమంలో మద్యానికి బానిసై రెండేళ్ల నుంచి వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఇదే విషయమై పలుమార్లు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు బిడ్డ కూడా పుట్టినట్లు తెలియడంతో ఈ విషయంపై శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య మరొకసారి పెద్దఎత్తున గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన నాగరాణి శుక్రవారం 8 గంటల సమయంలో ఇంటి నుంచి తన ముగ్గురు పిల్లలను తీసుకుని బయటికి వెళ్లింది. ఆమె తల్లితో ఇంట్లో జరిగిన గొడవ గురించి ఫోన్‌లో తెలియజేసిందని తెలిపారు. అనంతరం ఆమె వెలిగల్లు ప్రాజెక్టుకు దిగువన ఉన్న గండిమడుగులో తన ముగ్గురు పిల్లలను అందులో తోసేసి అనంతరం ఆమె కూడా అందులో దూకి మృతి చెందినట్లు తెలిపారు. అయితే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత 10 గంటల సమయంలో వారి తల్లి అనుమానంతో గాలివీడుకు చేరుకుని నాగరాణి ఇంటి నుంచి వెళ్లిపోయిన విషయం స్థానిక పోలీసులకు తెలిపింది. అనంతరం పోలీసులు, వారి కుటుంబ సభ్యులు వెలిగల్లు ప్రాజెక్టు, పాపాఘ్ని నది, గండిమడుగు, తదితర పరిసరాలను గాలించగా గండిమడుగు ఒడ్డున సెల్‌ఫోను, పిల్లల చెప్పులు ఉండడంతో వారు మడుగులోకి లైట్లు ద్వారా చూడగా ఇద్దరు పిల్లలు నవ్య, దినేశ్ నీటిలో తేలియాడుతూ కనిపించగా వారిని బయటకు తీశారు. అనంతరం సమీపంలోని జాలర్లను పిలిపించి నాగరాణి, జాన్వి మృతదేహాలను వెలికి తీసినట్లు తెలిపారు. వెలిసితీసిన నాలుగు మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్‌ఐ వెంకటప్రసాద్ తెలిపారు. జరిగిన సంఘటనపై మృతురాలి తల్లి రవణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త విక్రమ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో మండల కేంద్రంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
![]() |
![]() |