ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 23న శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. ప్రజాగళం పేరిట అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల సభలు నిర్వహిస్తున్న సంగతి విధితమే. ఈ క్రమంలో ఈ నెల 15న పలాసలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొన్నారు. తొమ్మిది రోజుల వ్యవధిలోనే జిల్లాకు మరోసారి వస్తున్నారు. 23న మధ్యాహ్నం 3గంటలకు పాతపట్నంలో, రాత్రి ఏడు గంటలకు ఆమదాలవలసలో ప్రజాగళం సభలు నిర్వహిస్తారు. అనంతరం రాత్రి శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో బస చేస్తారు. మరుసటి రోజు 24న జిల్లాలో మహిళా కార్యకర్తలు, డ్వాక్రా మహిళలతో సమావేశమవుతారు. పార్టీ అధినేత కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల నేతలు ఏర్పాట్లు ప్రారంభించారు. చంద్రబాబు పర్యటనకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు తరలిరావాలని ఆమదాలవలస, పాతపట్నం టీడీపీ అభ్యర్థులు కూన రవికుమార్, మామిడి గోవిందరావు పిలుపునిచ్చారు.
![]() |
![]() |