టీడీపీ అభ్యర్థులకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం బీఫామ్‌లు అందజేయనున్నారు. రెండు రోజుల కిందట పార్టీ జోనల్ ఇన్‌ఛార్జిలతో నిర్వహించిన సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జోనల్ ఇన్‌ఛార్జిల ద్వారా తొలుత బీ-ఫామ్‌లు ఇప్పించాలని భావించారు. అయితే, అభ్యర్థులు సెంటిమెంట్‌గా భావిస్తారనే సూచన మేరకు నిర్ణయం మార్చుకున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో మొత్తం 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల అభ్యర్థులకు తన చేతులమీదుగా బీఫామ్‌లను చంద్రబాబు అందజేస్తారు. అనంతరం అభ్యర్థులతో చంద్రబాబు సమావేశమై... ప్రచారం, వ్యూహ ప్రతి వ్యూహాలపై దిశా నిర్దేశం చేయనున్నారు
అయితే, కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులను పక్కనబెట్టి వేరేవారికి బీఫామ్ ఇస్తారని తెలుస్తోంది. ఇలాంటి వాటిలో మడకశిర, సూళ్లూరుపేట, మాడుగుల, ఉండి, పాడేరు, అనపర్తి, దెందలూరు స్థానాలు ఉన్నాయి. గురువారం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో జోనల్ ఇంఛార్జులు దామచర్ల సత్య, సుజయ్ కృష్ణ రంగారావు, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, పెళ్లకూరు శ్రీనివాస్ రెడ్డి, మంతెన సత్యనారాయణ రాజు, బీదా రవిచంద్ర యాదవ్, బొబ్బిలి చిరంజీవి, యనమదల రవి, దీపక్ రెడ్డి, కోవెలమూడి నాని పాల్గొన్నారు. అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యత జోనల్ ఇంఛార్జులు తీసుకోవాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల కాగా.. నామినేషన్ల ప్రక్రియ అదే రోజు మొదలైంది. నామినేషన్‌కు గడువు ఏప్రిల్ 25 కాగా.. మర్నాడు ఏప్రిల్ 26 నుంచి స్క్రూట్నీ నిర్వహిస్తారు. ఏప్రిల్ 29 వరకూ ఉపసంహరణకు అవకాశం ఉంది. శనివారం మూడో రోజు స్వతంత్రులు, చిన్న పార్టీల హవా కనిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పార్టీ, జై భారత్ నేషనల్ పార్టీ, జైభీమ్‌రావ్ పార్టీ, ఇండియన్ లేబర్‌పార్టీ, పిరమిడ్ పార్టీ, నవరంగ్ కాంగ్రెస్ పార్టీల తరఫున పలువురు నామినేషన్లు వేశారు. చాలా మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేశారు. శనివారం ఒక్కరోజే అసెంబ్లీ స్థానాలకు 227 మంది అభ్యర్థులు 263, 25 పార్లమెంటు స్థానాల్లో 37 మంది అభ్యర్థులు 40 నామినేషన్లు సమర్పించారు.